శ్రామిక్ రైళ్లపై తప్పుడు సమాచారం వ్యాప్తితో.. కర్ణాటక బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ ప్రాంతానికి వేల మంది వలస కార్మికులు తరలివచ్చారు. ఫలితంగా ఆ పరిసరాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఒడిశా సహా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు.. భారీ సంఖ్యలో చేరుకోవటం వల్ల కార్మికులు ఇబ్బందులు పడ్డారు. వారిని నియంత్రించడానికి అధికారులు తీవ్రంగా శ్రమించారు.
" స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు సేవా సింధు యాప్ ద్వారా 1,500 మంది నమోదు చేసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి, బస్సుల ద్వారా రైళ్ల వద్దకు చేరవేస్తామని, ప్యాలెస్ గ్రౌండ్స్ ప్రాంతానికి రావాలని వారికి సమాచారం ఇచ్చాం. కానీ, వారు ఇతరులకు కూడా ఈ సమాచారాన్ని చేరవేయటం ద్వారా భారీ సంఖ్యలో కూలీలు ఆ ప్రాంతానికి వచ్చారు. అది గందరగోళ పరిస్థితికి దారి తీసింది."
– అధికారులు.
సంఘటన స్థలానికి రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి సుధాకర్ చేరుకుని కార్మికులు శాంతియుతంగా ఉండాలని కోరారు. ఎవరూ ఆందోళనకు గురికావద్దని, అందరిని పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులకు సహకరించాలని కోరారు. ఆ సమయంలోనే ఓ యువకుడికి ఫిట్స్ రావటం వల్ల అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు సాయం చేశారు మంత్రి.
ప్రస్తుతం టికెట్లు, అవసరమైన పత్రాలు ఉన్న వారిని మాత్రమే అనుమతించామని, మిగతావారు తమ వంతు వచ్చే వరకు వేచి ఉండాలని సూచించారు.