చంద్రునిపై పరిస్థితుల అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ప్రాజెక్టు చంద్రయాన్-2. ఇటీవలే ప్రకటించిన ఈ ప్రయోగానికి సమయం ఆసన్నమైంది. సోమవారం వేకువజామున చంద్రయాన్-2తో జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ నింగికెగియనుంది.
''మేమంతా సిద్ధంగా ఉన్నాం. మరి మీరు....?
రోవర్ ఆధారిత భారత తొలి అంతరిక్ష ప్రయోగం... 'చంద్రయాన్ 2'. చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకొనే ప్రపంచంలోనే తొలి రోవర్ ఇది''
అంటూ ఇస్రో, చంద్రయాన్‌ను ట్యాగ్ చేస్తూ వీడియో పంచుకుంది పీఐబీ.
జాబిల్లి కక్ష్యలోకి భారత్ 2008లోనే చంద్రయాన్-1 పేరుతో ఉపగ్రహాన్ని పంపించింది. ఇప్పుడు చేపట్టే ప్రయోగం.. చంద్రయాన్-2 ద్వారా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌ను పంపనున్నారు.
ఆర్బిటర్ పూర్తిగా చంద్రుడి కక్ష్యలోనే తిరుగుతుంది. జులై 15న మొదలవనుందీ మహోత్తర ప్రయాణం. సెప్టెంబర్ 6 లేదా 7 తేదీల్లోగా ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై దిగుతుంది. అనంతరం.. అందులోంచి రోవర్ బయటికొచ్చి చంద్రుడిపై తిరగడం మొదలెడుతుంది.
చంద్రయాన్-2 ప్రయోగ వేదికైన శ్రీహరికోట సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం వద్ద సందడి నెలకొంది. వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా చంద్రయాన్-2 యంత్ర పరికరాలు తట్టుకునే విధంగా పలు క్లిష్ట ప్రయోగాలు చేస్తున్నారు. ఇందుకోసం స్వయంగా అక్కడి పరిస్థితులను భూమ్మీదే కృత్రిమంగా సృష్టించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. తద్వారా అంతరిక్ష రంగంలో భారత్ చేపట్టబోయే ప్రయోగం సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా చూడాలనుకుంటోంది ఇస్రో.