కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పథకానికి ఎప్పటికీ ఢోకా ఉండదని, ఆ విధానం భవిష్యత్తులోనూ కచ్చితంగా ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలతో కేంద్రం కనీస మద్దతు ధరకు మంగళం పాడబోతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ, ఆహార, జౌళిశాఖ కార్యదర్శులు, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సీఎండీ మీడియాతో బుధవారం మాట్లాడారు. ఇప్పటివరకూ రైతుల నుంచి సేకరించిన వ్యవసాయ ఉత్పత్తుల గురించి వివరించారు.
ఆరు నూరైనా ఎంఎస్‌పీ ఆగదని, రైతులకు భరోసా కల్పించడానికే కేంద్రం ఈసారి సెప్టెంబర్ 26 నుంచే కొనుగోళ్లు ప్రారంభించిందని అగర్వాల్ పేర్కొన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకుఆహార ధాన్యాలు పంపిణీ చేయాలంటే కచ్చితంగా ఎంఎస్‌పీ కింద కొనుగోలు చేయాల్సిందేనని, ఆ వ్యవస్థ రద్దు అవుతుందన్న ఆలోచనే అవసరం లేదని ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు 12 రాష్ట్రాల్లోని 125 జిల్లాల్లో 430 కేంద్రాల ద్వారా తాము పత్తి సేకరిస్తున్నట్లు జౌళిశాఖ కార్యదర్శి రవి చెప్పారు.