రఫేల్పై సుప్రీంకోర్టుకు కేంద్రం మరో ప్రమాణపత్రం సమర్పించింది. డిసెంబర్ 14న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు సరైందని అఫిడవిట్లో పేర్కొంది. మీడియాలో వచ్చిన నిరాధార కథనాల ఆధారంగా విచారణ అక్కర్లేదని స్పష్టం చేసింది.
రఫేల్పై తీర్పును పునఃసమీక్షించాలన్న పిటిషన్లపై విచారణను మంగళవారం సుప్రీంకోర్టు మే 6కు వాయిదా వేసింది. అదనపు ప్రమాణపత్రం దాఖలుకు నాలుగు వారాల సమయం కావాలని కేంద్రం అభ్యర్థించగా... నేటి(మే4)వరకు గడువిచ్చింది.
ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని సుప్రీంకోర్టు గతేడాది డిసెంబర్ 14న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ వేరుగా పిటిషన్ దాఖలు చేశారు.