దిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) దేశవ్యాప్తంగా పదవ తరగతి ఫలితాలు విడుదల చేసింది. ఈ సందర్భంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ 'నిషాంక్' ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు.
"ప్రియమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు... సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు"
-రమేశ్ పోఖ్రియాల్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్‌ఈ బోర్డు.. విద్యార్థులు పూర్వ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించింది.
- సీబీఎస్‌ఈ పరీక్షల ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోలిస్తే పెరిగింది. మొత్తం 91.46 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
- మొత్తం 1.84 లక్షల మంది విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించారు. 41 వేల మందికిపైగా 95 శాతానికి మించి మార్కులు గడించారు.
- బాలురతో పోలిస్తే బాలికల ఉత్తీర్ణత 3.17 శాతం ఎక్కువ.
- త్రివేండ్రం ప్రాంతం 99.28 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. గువాహటి ప్రాంతం 79.12 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది.
- అన్ని పరీక్షలు రాసిన 10 తరగతి విద్యార్థుల ఫలితాలను యథావిధిగా ప్రకటించారు.
- మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు రాసిన విద్యార్థులకు మాత్రం.. అత్యుత్తమ మార్కులు సాధించిన మూడు సబ్జెక్టుల సగటు ఆధారంగా ప్రతిభను మదింపు చేశారు.
- 3 సబ్జెక్టులకు మాత్రమే హాజరైన విద్యార్థులకు.. 2 సబ్జెక్టులలో సాధించిన అత్యుత్తమ మార్కుల సగటు, అంతర్గత, ప్రాక్టికల్ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా తుది మార్కులు కేటాయించారు.
- 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ బోర్డు ఇంకో అవకాశాన్ని ఇచ్చింది. మదింపు ఆధారంగా వచ్చిన మార్కులపై అసంతృప్తిగా ఉంటే.. ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించనుంది. పదో తరగతి విద్యార్థులకు మాత్రం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసే అవకాశం లేదని బోర్డు ఇదివరకే స్పష్టం చేసింది.