'ఫోర్ స్టార్ హోదా'లో 'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)' పదవి సృష్టించేందుకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఇటీవలే పచ్చజెండా ఊపింది. నిజానికి కార్గిల్ యుద్ధ సమయంలోనే ఈ పదవి ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఆ తర్వాత నెలకొల్పిన మంత్రుల బృందం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. త్రివిధ దళాల తరఫున ప్రభుత్వానికి ఏకైక సలహాదారు బాధ్యతను నిర్వర్తించడంలో, ప్రణాళిక, విధాన, కార్యాచరణ సమస్యలను పరిష్కరించడంలోనూ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సీఓఎస్సీ) విఫలమైందన్న విషయాన్ని 2001లోనే మంత్రుల బృందం స్పష్టం చేసింది. అందుకే త్రివిధ దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్- సీడీఎస్) పదవిని తీసుకురావాలని అప్పుడే ప్రభుత్వానికి సూచించింది సీఓఎస్సీ.
ఇదే అంశంపై దాదాపు 20 ఏళ్లుగా నడిచిన రాజకీయ ఒత్తిడికి తెరదించుతూ ఇటీవలే నరేంద్ర మోదీ సర్కారు సీడీఎస్ పదవికి పచ్చజెండా ఊపింది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనే త్రివిధ దళాలను ఒకే గొడుగు కిందకు తెస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించినప్పటికీ.. త్రివిధ దళాధిపతి విధివిధానాలు రూపొందించనందున కార్యాచరణలో ఇప్పటివరకు జాప్యం జరిగింది.
సైనిక ప్రక్షాళనతో పాటు త్రివిధ దళాల పనితీరును మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందో లేదో... సీడీఎస్ విధివిధానాలే అద్దం పడతాయని అందరూ భావించారు. అయితే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ బృందం రూపొందించిన సీడీఎస్ విధివిధానాలతో ప్రభుత్వం సైనిక ప్రక్షాళన వైపు అడుగులేస్తోందని తేటతెల్లమైంది.
సీడీఎస్ ముందున్న కీలక సవాళ్లు
శిక్షణ, కార్యకలాపాలు, సహాయక సేవలు, వ్యూహరచన తదితర అంశాల్లో త్రివిధ దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు సీడీఎస్‌కు మూడేళ్ల కాలపరిమితి ఇచ్చింది ప్రభుత్వం. వాయు, సైన్యం, నౌకాదళానికి ప్రస్తుతం వేర్వేరుగా శిక్షణ, కార్యకలాపాలు, సహాయక సేవలు, వ్యూహ రచనలున్నాయి. మూడు విభాగాల్లోనూ శిక్షణ సమయంలో ఉపయోగించే సామగ్రి దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ త్రివిధ దళాలకు వేర్వేరు శిక్షణా సంస్థలు ఉన్నాయి. కమ్యూనికేషన్లోనూ మూడింటి మధ్య సమన్వయ లోపం ఉంది. అందుకే త్రివిధ దళాలకు ఒకే సలహాదారు ఉంటే.. మానవశక్తి పొదుపుతో పాటు ఆయా సంస్థల పనితీరు కూడా మెరుగుపడుతుంది.
సీడీఎస్ నిర్వర్తించవలసిన మరో ప్రధాన బాధ్యత.. మిలిటరీ కమాండ్ పునర్వ్యవస్థీకరణ. త్రివిధ దళాలకు ప్రస్తుతం మొత్తం 19 భౌగోళిక(కమాండ్) వ్యవస్థలున్నాయి. ఇందులో సైన్యానికి ఆరు, నావికా దళానికి మూడు, వైమానిక దళానికి ఏడున్నాయి. వీటన్నింటి మధ్య సమన్వయం సాధించేలా, ఒకే కమాండ్ కింద పనిచేసేలా పునర్వ్యవస్థీకరించడం అవసరం.
యుద్ధ విమానాలు, నౌకలు, ట్యాంకులు తదితర వాటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో సీడీఎస్ నిర్ణయిస్తారు. పరిమిత రక్షణ బడ్జెట్ ఉన్నందున వర్గాల వారీగా కాకుండా మొత్తం సైనిక సామర్థ్యాన్ని సమగ్రంగా అంచనా వేసి అత్యంత ప్రధాన్యమైన వాటికే ఓటు వేస్తారు. సైన్యం, నావికాదళం, వైమానికి దళాలకు ఆయా రంగాల్లో కీలక లోపాలున్నాయన్నది వాస్తవమే. కానీ వాటన్నింటినీ ప్రస్తుత బడ్జెట్ నిధులతో సమకూర్చలేము. అన్నింటిలోనూ అత్యవసరమైన వాటికే ప్రాధాన్యమివ్వాలి. మిగతా వాటిని ఆ తర్వాత సమకూర్చుకోవాలి.
ప్రక్షాళనకు సహాయం అవసరం
సమాచారం, సైబర్ దాడులు, వైమానిక సవాళ్లు, ఆధునిక కృత్రిమ మేధస్సు తదితర వాటితోనే భవిష్యత్ యుద్ధాలు జరిగే అవకాశాలున్నాయి. అయితే ఈ రంగాలపై అధికారులు తక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. సరైన బడ్జెట్ కేటాయింపులు చేస్తే సీడీఎస్ వీటన్నింటిపైనా దృష్టిసారించే అవకాశాలున్నాయి.
సీడీఎస్ ఏర్పాటు వల్ల అపారమైన ప్రయోజనాలున్నాయి. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం, రక్షణ బడ్జెట్ నియంత్రణ, తదితర అంశాల్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కీలక పాత్ర పోషిస్తారు. అయితే సైనిక దళాల్లో ప్రక్షాళన దిశగా సీడీఎస్ అడుగులు వేయాలంటే బ్యూరోక్రసీ, రక్షణ బడ్జెట్ సహాయకులు, త్రివిధ దళాల అధిపతుల నుంచి సహకారం చాలా అవసరం.
(రచయిత- రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా, 2016 లక్షిత దాడులకు నాయకత్వం వహించిన అధికారి)