ఇకపై రైళ్లలో ప్రయాణికులు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వినూత్న వసతులు కల్పించాలని నిర్ణయించింది రైల్వే బోర్డు.
2018లో రైల్వే ఓ వెబ్ పోర్టల్‌ను సృష్టించింది. అందులో, రైళ్లలో కొత్తగా అమలు చేయాల్సిన, మెరుగు పరచాల్సినవి ఏవైనా ఉంటే.. వినూత్న ఆలోచనలను పోర్టల్‌లో ఎంటర్ చేసేలా జోనల్ ఉద్యోగులకు అవకాశం కల్పించింది. జోనల్ స్టేషన్లలో అమలు చేసిన, వినూత్న పథకాల వివరాలను పొందుపరచాలని సూచించింది. అప్పటి నుంచి 2019 డిసెంబర్ వరకు ఆ పోర్టల్‌లో దాదాపు 2,645 ఆలోచనలను పంచుకున్నారు ఉద్యోగులు. వాటిలో 20 ఆలోచనలను తక్షణమే అమలు చేయాలని నిర్ణయించింది భారతీయ రైల్వే. ఈ మేరకు, జోనల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది.
సరికొత్త ఫీచర్లు ఇవే..
- కొన్ని సార్లు రైలు కదులుతుందని తెలియక, నీళ్ల బాటిల్ కోసమో, చిరుతిళ్ల కోసమో రైలు దిగి మళ్లీ రైలు దగ్గరకు వచ్చే సరికి కదిలిపోతుంది. అలాంటి ఇబ్బంది లేకుండా.. రైలు కదలడానికి రెండు నిమిషాల ముందు ఓ గంట మోగేలా ఏర్పాటు చేసింది అలహాబాద్ డివిజన్లోని ఓ జంక్షన్. ఈ మూవింగ్ బెల్ ఆలోచనను ఇప్పుడు అన్ని జోన్లు అమలు చేయనున్నాయి.
- ప్రతి కోచ్‌లోనూ దృశ్యాలు రికార్డ్ చేయగలిగే సీసీటీవీ మానిటర్లు ఏర్పాటు చేయనుంది రైల్వే. హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లలో ఇప్పటికే సీసీటీవీలు ఉన్నప్పటికీ.. మానిటర్లు మాత్రం లేవు. అయితే, ఇప్పుడు ఉత్తర మధ్య రైల్వే 18 హమ్‌సఫర్ కోచ్‌లలో ఈ మానిటర్లను ఏర్పాటు చేసింది. వీటివల్ల రైళ్లలో నేరాలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి వీటిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది.
- పశ్చిమ రైల్వేలోని కొన్ని రైల్వే స్టేషన్లలో విద్యుత్ అవసరం లేకుండానే నడిచే వాటర్ కూలర్లను పెట్టించారు. ఒక్కొక్కటి రూ. 1.25 లక్షలు విలువ చేసే ఈ కూలర్లను దేశవ్యాప్తంగా అన్ని స్టేషన్లలోనూ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది బోర్డు.
- నార్త్ సెంట్రల్ రైల్వేలోని అలహాబాద్ డివిజన్ క్యారేజ్ వాగన్ విభాగం.. రైలు నడుస్తున్నప్పుడు పట్టాలు తప్పే అవకాశాన్ని ముందే గుర్తించేందుకు హాట్ యాక్సిల్ బాక్స్ డిటెక్టర్లను అభివృద్ధి చేసింది.
- రైళ్లు ఎలాంటి కండిషన్లో ఉన్నాయి, ఏవైనా సాంకేతిక లోపాలున్నాయా అని పరిశీలించాలంటే ఇన్నాళ్లు ఓ మనిషి తప్పనిసరిగా ఉండాల్సివచ్చేది. కానీ ఇప్పడు ఆ అల్ట్రా సోనిక్ డిటెక్షన్ కోసం, ఓ వెహిక్యులర్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది ఉత్తర మధ్య రైల్వే. ఇప్పుడు ఈ పద్ధతిని అన్ని రైళ్లకూ వర్తింపచేయనుంది రైల్వే శాఖ.
- కరోనా వేళ.. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఓ మొబైల్ యాప్ లేదా బ్లూటూత్ ద్వారా టికెట్లు ముద్రించుకునేలా ఏర్పాటు చేయనుంది రైల్వే. అంటే, ఇకపై రిజర్వేషన్ లేని టికెట్ల కోసం కౌంటర్ వద్ద బారులు తీరకుండా, ఆన్లైన్లోనే టికెట్లు పొందేలా.. స్టేషన్లలో యూటీఎస్ కనెక్టివిటీ వసతి కల్పించనుంది.
- రైళ్ల వేగం, పట్టాల ఉష్ణోగ్రతను అంచనా వేసేందుకు పైరోమీటర్ విధానాన్ని అమలు చేస్తోంది తూర్పు మధ్య రైల్వే. ఆ స్ఫూర్తితో అన్ని జోన్లు ఇకపై ఈ పద్ధతిని పాటించనున్నాయి.
మరో మూడు నెలల్లో ఈ 20 వినూత్న సౌకర్యాలను ఏర్పాటు చేసి.. నివేదిక పంపించాల్సిందిగా జోన్లను ఆదేశించింది రైల్వే బోర్డు.
ఇదీ చదవండి: స్మగ్లింగ్ కేసు: కేరళకు బంగారు కి'లేడీ'