కర్ణాటకలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది యడియూరప్ప ప్రభుత్వం. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార, ప్రతిపక్ష నేతలు ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు రావడంతో.. మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. యడియూరప్ప ప్రభుత్వ విజ్ఞప్తిపై స్పందించిన సీబీఐ... ఫోన్ ట్యాపింగ్‌పై కేసు నమోదు చేసింది.
ఫోన్ ట్యాపింగ్ సమస్యపై నిజానిజాలు రాబట్టేందుకు సీఎల్పీ నేత సిద్ధరామయ్య సహా పలువురు కాంగ్రెస్ నేతలు దర్యాప్తునకు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన యడియూరప్ప.. గతంలోనే సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.
కుమార సర్కారుపై ఆరోపణలు....
అంతకుముందు... హెచ్డీ కుమారస్వామి ప్రభుత్వంపై రెబల్ ఎమ్మెల్యే ఏహెచ్ విశ్వనాథ్ రాజకీయ బాంబు పేల్చారు. సుమారు 300 మందికిపైగా నేతల ఫోన్ ట్యాప్ చేసి, గూఢచర్యానికి పాల్పడిందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి తెలిసే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పారు విశ్వనాథ్. కూటమిలో అసమ్మతి నేపథ్యంలో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కుమారస్వామి ఈ తతంగాన్ని వెనకుండి నడిపించారని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ఖండించారు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. అలాంటి అవసరం తనకు లేదన్నారు. ట్యాపింగ్‌పై రాజకీయ వేడి రాజుకున్న తరుణంలో సీబీఐకి అప్పగించడం ప్రాధ్యాన్యం సంతరించుకుంది.