ఆదాయపన్ను శాఖ అధికారులపై సీబీఐ దాడులు నిర్వహించింది. ఐటీ అధికారులు లంచం పుచ్చుకుంటున్నారనే పక్కా సమాచారంతో మాటు వేసి పట్టుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.
పన్ను బకాయిల పరిష్కారం విషయంలో ఇద్దరు ఐటీ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు ఓ వ్యక్తి సీబీఐని ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో సీబీఐ అధికారులు ఐటీ అధికారి హెచ్.ఆర్ నగేశ్ రూ. 14 లక్షలు తీసుకుంటుండగా అడ్డంగా పట్టుకున్నారు.
" ఫిర్యాదుదారుని నుంచి రూ.14 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఐటీ అధికారులపై కేసు నమోదు చేశాం. అతని కార్యాలయంలో ఐటీ శాఖ నిర్వహించిన సర్వేలో తేలిన సమస్యలను పరిష్కరించడానికి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి."
- సీబీఐ అధికార ప్రతినిధి
నగేశ్ ఇంటిపై దాడులు నిర్వహించారు సీబీఐ అధికారులు. మరో బృందం నగేశ్‌కు చెందిన కాఫీ డే దుకాణంలో సోదాలు నిర్వహించింది. సోదాల్లో భాగంగా రికార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నగేశ్‌తో పాటు మరో అధికారి నరేంద్ర సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తరలించారు.
జరిగిన కథేంటి?
మార్చి 6న నగేశ్ బృందం 'విండెర్స్ ఎడిఫిక్' సంస్థలో ఆదాయ పన్నుకు సంబంధించిన సర్వే నిర్వహించింది. విచారణలో భాగంగా రూ.25 లక్షలు, రూ.15 లక్షల విలువైన రశీదులను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 11న సంస్థ ఎండీ శ్రీనివాస్‌ను విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
ఆ తరువాత మార్చి 19న నగేశ్, నరేంద్ర సింగ్‌లు రూ. 40 లక్షలు ఇవ్వాలని ఆ వ్యక్తిని డిమాండ్ చేశారు. ముందుగా రూ. 20 లక్షలు ఇవ్వాలని తెలిపారు. ఈ సమాచారం అందుకున్న సీబీఐ వారిపై దాడులు చేపట్టింది.
ప్రస్తుతం ఇరువురిని ఉద్యోగాల్లోంచి తొలగించినట్లు సమాచారం. ఈ విషయంలో ఆదాయపన్ను శాఖ ఇంకా ఏ సమాచారం వెల్లడించలేదు.