పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసు విచారణ వేగవంతం అయింది. ప్రధాన నిందితుడు తిరునవుకరసు ఇంట్లో సుమారు నాలుగు గంటలు పాటు సోదాలు జరిపిన సీబీ- సీఐడీ... మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకుంది.
ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలతో పాటు, ఐదు మొబైల్ ఫోన్లు, కొన్ని సిమ్‌కార్డులు, సమాచారాన్ని భద్రపరిచే కొన్ని సాధనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీ- సీఐడీ అధికారి ఒకరు తెలిపారు.
సీబీఐకు కేసు బదిలీ
కేసును సీబీ-సీఐడీ నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ నలుగురు నిందితులను కస్టడీకి అప్పగించాలని మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది సీబీ-సీఐడీ.
అంతర్జాలంలో ఉన్న బాధితుల వీడియోలను తొలగించాలని కేంద్రాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. తమిళనాడు రాష్ట్ర హోంశాఖ విడుదల చేసిన ప్రకటనలో బాధితురాలి వివరాలు బహిర్గతం చేయటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోం శాఖ ప్రతి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చే బాధితులను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేస్తొందని డీఎంకే అధినేత స్టాలిన్ ఆరోపించారు.
సుప్రీంలో పిటిషన్
సీబీఐ విచారణపై పర్యవేక్షణతో పాటు బాధితుల వివరాలు గోప్యంగా ఉండేలా చూడాలని సుప్రీంలో వ్యాజ్యం దాఖలైంది. కేసుకు సంబంధించిన అన్ని విచారణలు తమిళనాడు రాష్ట్రం బయట జరిగేలా ఆదేశించాలని, అలాగే బాధితురాలి వివరాలు ఎలా బయటకు వచ్చాయో శాఖపరమైన విచారణకు ఆదేశించాలని వ్యాజ్యంలో కోరారు పిటిషనర్.