విద్యార్థులకు మంచి మార్కులే సర్వం కాదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో భాగంగా దిల్లీలోని తల్కతోరా స్టేడియంలో విద్యార్థులతో ముచ్చటించిన ఆయన.. పరీక్షల సమయాల్లో విద్యార్థులు ఒత్తిడిని జయించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు.
చంద్రయాన్ గురించి..
చంద్రయాన్-2 ప్రయోగంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మోదీ.
"చంద్రయాన్ కోసం రాత్రంతా మీరు మేల్కొన్నారు. మీరే చేశారనుకుని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ప్రయోగం విజయవంతం కాని కారణంగా భారత్ మొత్తం నిరాశ చెందారా లేదా? రాత్రంతా మేల్కొని ఎదురుచూశాం. అప్పుడప్పుడు అలా వైఫల్యం మనల్ని నిరాశపరుస్తుంది. ఆ రోజు నేను కూడా అక్కడే ఉన్నాను. మీకో రహస్యం చెప్పాలి. కొంతమంది నా సన్నిహితులు అక్కడికి వెళ్లొద్దన్నారు. ప్రయోగం విజయవంతం కాకుంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. అయితే అందుకోసమైనా నేనక్కడకు వెళ్లాలని సమాధానమిచ్చాను."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
'ఇంట్లో సాంకేతికత లేని గది'
ప్రతి ఇంట్లో సాంకేతికత లేని గదిని తయారుచేసుకోవాలని విద్యార్థులకు సూచించారు మోదీ. సాంకేతికత మన అదుపులో ఉండాలని, మనం టెక్నాలజీ అదుపులో ఉండకూడదన్నారు.
"ఏ కుటుంబంలో అయితే రెండు మూడు గదులుంటాయో.. మీరు తల్లిదండ్రులతో కూర్చుని నిర్ణయం తీసుకోగలుగుతారా? ఏదైనా ఒక గదిలో సాంకేతికతను ఉపయోగించకుండా ఉండేందుకు నిర్ణయిస్తారా? ఆ గదిలోకి ఎవరు వచ్చినా సాంకేతికత లేకుండా ఉంటారు. మీరు చేసి చూడండి చక్కటి అనుభవాలు మీ సొంతమవుతాయి."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
పరీక్షలే జీవితం కాదు..
ఎలాంటి సంశయం లేకుండా విద్యార్థులు తనతో మాట్లాడాలన్నారు మోదీ. జీవితంలో వైఫల్యాలను చూసి బెదిరిపోకూడదని, అవి జీవితంలో భాగంగా భావించాలన్నారు. పరీక్షలే జీవితంలో అంతా అని భావించకూడదని ఉద్బోధించారు. తన 'ఎగ్జామ్ వారియర్స్' పుస్తకాన్ని చదవాలని సూచించారు మోదీ.
తల్లిదండ్రులకు సూచనలు
విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణం కల్పించాలని తల్లిదండ్రులకు సూచించారు మోదీ. క్రీడలు వంటి విద్యేతర అంశాల్లో పిల్లలను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుతం విద్యేతర అంశాలు వృత్తిగా మారుతున్నాయని, మార్పును గమనించాలన్నారు.
"స్టీల్ స్ప్రింగ్‌ను చూసి ఉంటారు కదా? ఎక్కువగా సాగతీస్తే ఏమవుతుంది. దాని గుణం కోల్పోయి లోహపు తీగగా మారుతుంది కదా. ఆ తర్వాత స్ప్రింగ్‌లా అది పనిచేస్తుందా. తల్లిదండ్రులు, టీచర్లు ఇది ఆలోచించాలి. పిల్లాడిలో సామర్థ్యం ఉందా లేదా అని గుర్తించాలి. ఆ మేరకు ప్రోత్సహించాలి."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: భాజపా అధ్యక్షుడిగా నడ్డా ముందున్న సవాళ్లివే