కాశీలో 'తిరస్కరణ'పై విచారణకు నిరాకరణ - వారణాసి
వారణాసిలో నామపత్రం తిరస్కరణపై మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు నిరాకరించింది సుప్రీం కోర్టు. ఆ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తేల్చిచెప్పింది.
వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీపై పోటీకి విఫలయత్నం చేసిన మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నామపత్రాల తిరస్కరణపై దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది న్యాయస్థానం. ఈ వ్యాజ్యాన్ని విచారణ చేపట్టేందుకు ఎలాంటి కారణం లేదని పేర్కొంది.
గత తీర్పులను పేర్కొంటూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పుడు ఎన్నికల వాజ్యాలు దాఖలు చేయొచ్చని జవాను తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వివరించారు. ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు ఎన్నికలు పూర్తయిన తరువాతే దాఖలు చేయాలని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదించారు. ఈమేరకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం... తేజ్ బహదూర్ యాదవ్ పిటిషన్‌ను కొట్టివేసింది.
ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అభ్యర్థిగా తేజ్ బహదూర్ నామపత్రం సమర్పించారు. ఉద్యోగ కాలంలో ఎలాంటి రాజద్రోహం, అవినీతికి పాల్పడలేదన్న ధ్రువపత్రాన్ని సమర్పించాలని బహదూర్‌ను కోరింది ఈసీ. గడువులోగా సర్టిఫికేట్ సమర్పించనందున ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు రిటర్నింగ్ అధికారి. అధికారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం గడప తొక్కారు బహదూర్.
గతంలో సరిహద్దు భద్రతా దళ సైనికుడిగా పనిచేసిన బహదూర్... సైనికులకు వడ్డించే ఆహారంపై ఫిర్యాదు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విడుదల చేశారు. ఫలితంగా 2017లో ఆయన్ను ఉద్యోగం నుంచి తప్పించారు అధికారులు.
ఇదీ చూడండి: రాజీవ్ కేసు దోషుల విడుదలపై పిటిషన్ తిరస్కరణ