Knee Braces for Osteoarthritis : ప్రస్తుత కాలంలో మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ చేయకపోవడం, ఒకే భంగిమలో ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మధ్య వయస్సులోనే వస్తున్నాయి. గతంలో 50-60 ఏళ్లలో వచ్చే మోకాళ్ల నొప్పులు ఇటీవల కాలంలో చిన్నవయసులోనే చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి.
కీళ్లకు సంబంధించిన సమస్యలను 'అర్థరైటిస్' అని అంటారు. అయితే, కొంతమందికి తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు మోకాలి సర్జరీ చేస్తుంటారు. అయితే, చాలా మంది మోకాలి సర్జరీ తర్వాత బ్రేస్‌లు (మోకాలి పట్టీలు) వేసుకుంటుంటారు. అలాగే కీళ్లు గట్టిపడి చిన్న చిన్న పనులు చేయలేని వారు, కూర్చుని లేవడం, మెట్లు ఎక్కడం ఇబ్బందిగా ఉన్న వారు కూడా మోకాలి పట్టీలు ధరిస్తుంటారు. అయితే, మోకాలి పట్టీలు ధరించడం వల్ల నొప్పి తగ్గుతుందాని చాలా మంది భావిస్తుంటారు. నిజంగానే మోకాలి పట్టీలు వేసుకోవడం వల్ల పెయిన్ తగ్గుతుందా.. లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా వయసు పై పడుతున్నా కొద్ది మోకాళ్లలో కార్టిలేజ్ దెబ్బతింటుంది. దీంతో నొప్పి, వాపు మొదలై కీళ్లు కదపడం ఇబ్బందిగా మారుతుంది. మోకాళ్లు కదిల్చినప్పుడు మెల్లగా మొదలయ్యే నొప్పి క్రమేపి మనల్ని నడవలేని స్థితికి చేరుస్తుంది. అయితే, మోకాలి పట్టీలు కీళ్లకు దన్నుగా నిలిచి, నొప్పి తగ్గటానికి తోడ్పడతాయి. మానసికంగానూ నొప్పి తగ్గిన భావన కలిగిస్తాయని హార్వర్డ్ హెల్త్ పరిశోధకుల బృందం వెల్లడించింది. అలాగే మోకాలు వాపును కూడా కొంత వరకు తగ్గిస్తుందని కనుగొన్నారు. ఈ విషయాన్ని హార్వర్డ్ హెల్త్ లెటర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ డాక్టర్ హెడీ గాడ్మాన్ (Heidi Godman) తెలిపారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
అయితే, ముఖ్యంగా మార్కెట్లో మోకాలు పట్టీలు మూడు రకాలుగా లభిస్తున్నాయి. అవి..
మోకాలి స్లీవ్ : సాధారణంగా ఎక్కువ మంది మోకాలు నొప్పితో బాధపడేవారు రబ్బర్‌తో తయారు చేసినటువంటి ఫ్యాబ్రిక్‌ని ధరిస్తుంటారు. ఇది మోకాలు పైనుంచి కింది వరకు దాదాపు ఆరు అంగుళాలు ఉంటుంది. ఈ రకమైనటువంటి మోకాలు పట్టీ కండరాలను పట్టి ఉంచుతుంది. దీనిని వేసుకోవడం వల్ల కాస్త నొప్పి, వాపు తగ్గి నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు వీలుగా ఉంటుంది.
అలాగే అన్‌లోడర్ బ్రేస్ (unloader brace), పాటెల్లా ట్రాకింగ్ బ్రేస్‌లు (Patella tracking braces) కూడా మోకాలు నొప్పి తగ్గడానికి ఎంతో తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, మోకాలు నొప్పితో బాధపడేవారు వైద్యులను సంప్రదించడం ద్వారా.. వారు మీకు ఏ రకమైనటువంటి బ్రేస్ సెట్ అవుతుందో సూచిస్తుంటారు. దానిని ధరించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
ఇవి తింటే గుండె సమస్యలు రావట! - పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి!
ఆ ఫుడ్ తింటే పెద్దపేగు క్యాన్సర్ వస్తుందట జాగ్రత్త! ఈ డైట్ పాటిస్తే సేఫ్!