బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాలు విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా. ఈటీవీ భారత్ ముఖాముఖిలో.. పొత్తుకు సంబంధించిన అంశాలతో పాటు.. కూటమి గెలుస్తుందనటానికి గల కారణాలను విశ్లేషించారు రాజా. రాష్ట్రంలో భాజపా-నితీశ్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శిస్తూనే.. అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని వెల్లడించారు.
"కూటమి లౌకికవాది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బలంగా కనిపిస్తోంది. అంతిమ లక్ష్యం భాజపా, మిత్రపక్షాలను ఓడించడమే. అలాగే, ప్రస్తుతం బిహార్ అభివృద్ధికి కొత్త ప్రభుత్వం అవసరం. ప్రజా సంక్షేమం కోసం పనిచేయటంలో జేడీయూ-భాజపా పూర్తిగా విఫలమయ్యాయి."
-డి.రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి
మహాకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీచేయనుండగా, కాంగ్రెస్ 70 స్థానాలు దక్కించుకుంది. వామపక్షాలకు 29 సీట్లు కేటాయించారు. ఇందులో సీపీఐ-ఎంఎల్-19, సీపీఐ-6, సీపీఎం-4 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.
ఈ నేపథ్యంలో తమకు కేటాయించిన సీట్లలో గణనీయమైన స్థానాలు గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు డి.రాజా.
'ఇవేం రాజకీయాలు?'
బిహార్ శాసనసభ ఎన్నికలు భాజపాకు కీలకంగా నిలవనున్నాయి. గత ఐదేళ్లలో గుజరాత్, యూపీలో తప్ప పెద్ద రాష్ట్రాల్లో విజయం సాధించలేకపోయింది కమలం పార్టీ. అందుకే, బిహార్ అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే మిత్రపక్షం జేడీయూతో కలిసి ఉద్ధృతంగా ప్రచారం చేస్తోంది. ప్రధాని మోదీ సైతం ర్యాలీలు చేపడుతున్నారు. ఎల్జేపీ ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించటం కొత్త సమస్యలు తీసుకొచ్చినా భాజపా... జేడీయూ-ఎల్జేపీ మధ్య సమాన దూరం పాటిస్తోంది.
ఈ పొత్తుపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా... ఎన్డీఏ రాజకీయ శైలిని తప్పుబట్టారు.
"వ్యూహాత్మకంగా ఈ తరహా రాజకీయ ఆటలకు పాసవాన్ పార్టీ తెరదీసింది. కూటమి తరఫున పరిస్థితులకు అనుగుణంగా పార్టీలన్నింటినీ కులుపుకుని ముందుకెళ్తాం. మహాకూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది."
-డి.రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి
నితీశ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన రాజా... కరోనాను నియంత్రించటంలో కేంద్ర, రాష్ట్ర సర్కార్లు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
ఇదీ చూడండి:నితీశ్‌కు చెక్ పెట్టేందుకే భాజపా వ్యూహం!
ఇదీ చూడండి: 'జేడీయూకు ఓటేయొద్దు.. భాజపా-ఎల్జేపీదే గెలుపు'