నేషనల్ ఈ- మొబిలిటీ మిషన్ ప్లాన్ (ఎన్ఈఎంఎంపీ) పథకం కింద కేంద్రం విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయాలని సీపీఐఎల్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారించింది. రాయితీలు ఇవ్వడం ద్వారా కేంద్రం విద్యుత్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించాలని పిల్లో పేర్కొనగా.. స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.
ఎలక్ట్రిక్ వాహనాల అంశంపై వివరణ ఇచ్చేందుకు కేంద్ర పర్యావరణ మంత్రి కోర్టుకు రాగలరా అని ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం అదనపు సొలిసిటర్ జనరల్‌ను అడిగింది. ఈ విషయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాజకీయ పరమైన కారణాల వల్ల మంత్రి కోర్టుకు రాలేరని చెప్పారు. అయితే రాజకీయ నాయకులు కోర్టుకు రావడంలో తప్పేం లేదని ధర్మాసనం పేర్కొంది.
వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం. ఈలోపు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.