భారత రాజ్యాంగంలోని అధికరణ 21... దేశ ప్రజలందరికీ గౌరవంగా జీవించటం, వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతను కాపాడుకునే హక్కు కల్పించింది. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో వీటికి చోటు కల్పించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వాలు కరోనా వైరస్ విషయంలో ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు ప్రశంసనీయం.
కొన్ని దేశాల అధినాయకుల పద్ధతుల్లో తేడాలున్నా.. ఈ మహమ్మారిపై ఐకమత్యంగా పోరాడాలనే వారు కోరుతున్నారు. అయితే కరోనా వైరస్‌ను ఎదుర్కోవటానికి కృత్రిమ మేధ, జీవ సాంకేతికతను వినియోగించుకునేందుకు కొన్ని దేశాలు ముందుకొస్తున్నాయి.
మొబైల్ ఫోన్ తోనే..
ప్రపంచమంతా లాక్డౌన్లో ఉన్న నేపథ్యంలో చైనా నుంచి అమెరికా వరకు కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్ ద్వారా ప్రజల ఫోన్ల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. లొకేషన్, ముఖ కవళికల గుర్తింపుతో ప్రజలను స్క్రీనింగ్ చేసేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. టెన్సెంట్, అలీబాబా వంటి ప్రైవేట్ దిగ్గజాలు చైనా ప్రభుత్వంతో కలిసి ఈ మేరకు పనిచేస్తున్నాయి.
వివిధ యాప్‌లను ఉపయోగించి ప్రజల ప్రయాణ వివరాలను చైనా ప్రభుత్వం సేకరిస్తోంది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంత సమయం గడిపారు? ఇతరులతో ఎంతసేపు మాట్లాడారు? వంటి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఫలితంగా ప్రజలకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందుతాయి.
మన దేశంలోనూ..
భారత్‌లోనూ కరోనా యాప్ స్క్రీనింగ్ సాధనంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చైనా అల్గారిథంలో డేటాను సేకరించి ప్రజలకు యెల్లో, రెడ్, గ్రీన్ కోడ్ రూపంలో ఆరోగ్య సూచనలు చేస్తోంది.
ఈ కలర్ కోడ్లతో ఒక వ్యక్తి క్వారంటైన్లో ఉండాలా లేదా? ప్రజారవాణా వ్యవస్థను వినియోగించుకోవచ్చా? అనే విషయాలను తెలియజేస్తున్నాయి. అయితే ఈ సమాచార సేకరణ పౌరుడి ఇష్టానుసారంగా జరగదు. ఒక వ్యక్తి అస్థిరమైన సమాధానాలు లేదా అబద్ధాలు చెబితే కృత్రిమ మేధ గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తుంది.
ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వాలు బలవంతపు చర్యలు తీసుకుంటాయి. ప్రభుత్వం వ్యక్తిగత గోప్యతను పక్కనబెట్టి ఫోన్లు, కంప్యూటర్లు, కెమెరాలలోని సమాచారాన్ని ప్రైవేటు సంస్థలు సేకరించేందుకు స్వేచ్ఛనిచ్చింది.
కదలికలపై నిఘా..
చైనా ప్రభుత్వం అయితే మరో అడుగు ముందుకు వేసి బ్లాక్ మిర్రర్ సాంకేతికతను ఉపయోగిస్తోంది. దీని ద్వారా దేశ ప్రజల ప్రతి కదలిక, ప్రవర్తనను పర్యవేక్షిస్తోంది. ఒకవేళ పౌరుడి ప్రవర్తన బాగోలేకుంటే అతనిపై బలవంతపు చర్యలు, ఆంక్షలు విధిస్తోంది.
ఇంగ్లాండ్‌లోనూ ఓ2 టెలికాం సంస్థతో అక్కడి ప్రభుత్వం కలిసి పనిచేస్తోంది. స్మార్ట్ ఫోన్ల నుంచి లొకేషన్ డేటాను సేకరించి ప్రజలు సామాజిక దూరం నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పర్యవేక్షిస్తోంది.
ఇజ్రాయెల్ ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉంది. ప్రజలు కరోనా బారిన పడ్డారా లేదా అనే తెలుసుకునేందుకు మొబైల్ నిఘా ద్వారా సందేశాలు పంపుతోంది. ఇందుకు ప్రభుత్వానికి వినియోగదారుల డేటాను అందిస్తూ ఫేస్ బుక్, గూగుల్ తదితర సంస్థలు తమవంతు సాయం చేస్తున్నాయి.
ఈ అధునాతన సాంకేతికతతో మీరు ఎక్కడున్నా మీపై నిరంతరం నిఘా ఉంటుందనేది స్పష్టమవుతుంది. ఇది ప్రజారోగ్యం, మీ మంచికోసమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ విషయంలో దాచడానికి ఏమీ లేదని వారంటున్నారు.
సామూహిక నిఘా
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో కృత్రిమ మేధ ఆధారిత సంస్థలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. రెండు దేశాలు కృత్రిమే మేధ ఆధారిత నిఘా, వైద్య సాంకేతికతపై దృష్టి సారించాయి.
ప్రస్తుతం కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు సిలికాన్ వ్యాలీకి చెందిన బ్లూడాట్ అనే సంస్థ సహాయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ప్రజలపై సామూహిక నిఘా వ్యవస్థను రూపొందించాలని తెలిపారు. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు కూడా శ్వేతసౌధంతో కలిసి పని చేస్తున్నాయి. ప్రజల హృదయ స్పందనను ప్రతి నిమిషం నమోదు చేసే సాంకేతికతను రూపొందించేందుకు పూనుకున్నాయి.
దుర్వినియోగం..!
ప్రజల నుంచి ప్రతి సమాచారాన్ని సేకరించేందుకు యుద్ధ కాలంలో అనుసరించే అత్యవసర అధికారాలను ప్రస్తుతం ప్రపంచ దేశాలు వినియోగిస్తున్నాయి. అయితే ఇది నిరంతరం కొనసాగుతుందని చెప్పలేమని బ్లూడాట్ సీఈఓ కమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఇది ప్రభుత్వాలు, ప్రజాస్వామ్య సంస్థలపై సాంకేతిక సంస్థలకు అపనమ్మకానికి దారి తీస్తుందన్నారు.
"కరోనాకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు చేస్తున్న కృషిని నేను అనుమానించను. కానీ, కరోనా పోయిన తర్వాత ఏఐ ఆధారిత సామూహిక నిఘా వ్యవస్థతో ఏం పని? కరోనా తర్వాత ఈ నిఘా పోతుందా లేదా మరింత విస్తరిస్తుందా? సామూహిక నిఘా వ్యవస్థ ఇలాగే కొనసాగితే దానిని దుర్వినియోగం చేస్తారనటంలో సందేహం లేదు."
- కమ్రాన్ ఖాన్, బ్లూడాట్ సీఈఓ
కమ్రాన్ ఖాన్ లేవనెత్తిన అనుమానాలకు కొందరు విశ్లేషకులు మద్దతు ఇస్తున్నారు. కృత్రిమ మేధకు 5-జీ సాంకేతికత తోడైతే దాని ప్రమాదం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ప్రజల జీవితాల్లోకి తొంగి చూసే అవకాశం లేకపోలేదంటున్నారు.
విద్వేషం పెరుగుతుందా?
కరోనాపై పోరాడేందుకు సామూహిక నిఘా వ్యవస్థ.. ప్రజల అనుమతితోనే మన జీవితాల్లోకి వస్తున్నందున జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. భయాలు పెరుగుతున్న కొద్దీ తిరుగుబాటు పెరుగుతుందని.. ఆసియా ప్రజల పరిస్థితి హిట్లర్ కాలంలో యూదులను తలపిస్తుందని పలువురు చెబుతున్నారు. జాతి విద్వేష చర్యలు పెరిగి ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టేస్తుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
అణ్వాయుధాలను మించి..
మరో విద్వేష మారణహోమానికి సాంకేతిక పరిజ్ఞానం సాయం చేస్తుందా లేదా అనే విషయాన్ని మనం నిర్ధరించుకోవాలి. లక్షలాది మందిని బలి తీసుకున్న ప్రపంచ యుద్ధాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఇందుకు మనకు ఉపయోగపడుతాయి. సాంకేతికతను కూడా మారణహోమం కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. అణు బాంబు నుంచి గ్యాస్ ఛాంబర్ల దాకా అన్ని సాంకేతిక ఆవిష్కరణలు చివరికి విధ్వంసాన్నే సృష్టించాయి.
సైన్స్ లెజెండ్ స్టీఫెన్ హాకింగ్, సాంకేతిక దిగ్గజం ఎలోన్ మస్క్ ఇప్పటికే కృత్రిమ మేధను వ్యతిరేకించారు. దాని దుష్ప్రభావాలపై ప్రపంచాన్ని హెచ్చరించారు. అణ్వాయుధాల కన్నా కృత్రిమ మేధ చాలా ప్రమాదకరమైనది అని మస్క్ అభిప్రాయపడ్డారు.
కొత్త రోగాన్ని సృష్టించవద్దు..
ఇన్ని దుష్ప్పభావాల నేపథ్యంలో కృత్రిమ మేధను విచక్షణా రహితంగా ఉపయోగించటాన్ని నిర్మూలించాలి. ముఖ్యంగా వ్యక్తిగత సమాచారం, హక్కులను కాలరాసే చర్యలను నివారించాలి. ప్రైవేటు సంస్థలు నిర్వహించే కృత్రిమ మేధ ఆధారిత నిఘాతో ప్రజాస్వామ్యం, గోప్యత, మానవత్వానికి చాలా ప్రమాదం పొంచి ఉంది.
కరోనా సంక్షోభం వచ్చిందని ప్రైవేటు సంస్థలకు నిబంధనల నుంచి స్వేచ్ఛను ఇవ్వటం సరైనది కాదు. దీనికి ముందుగానే ప్రభుత్వాలు సరైన ఒప్పందం చేసుకోవాలి. కరోనాను ఎలాంటి పరిస్థితుల్లోనూ అరికట్టడాన్ని ప్రజలు అంగీకరిస్తారు. కానీ పరిష్కారం పేరుతో సామూహిక నిఘా అనే మరో మహమ్మారిని సృష్టించవద్దు.
ఇప్పుడు మనం తీసుకునే తాత్కాలికమైన అత్యవసర చర్యలు భవిష్యత్తులో దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. ఇలా జరగకూడదంటే కృత్రిమ మేధ, ప్రైవేట్ సమాచార సంస్థల నియంత్రణపై ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఉండాలి.
(రచయిత- ఇంద్ర శేఖర్ సింగ్)
ఇదీ చూడండి: చైనాలో కరోనా 2.0- వుహాన్‌లో మళ్లీ ఆంక్షలు!