వచ్చే పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేయనుంది. డ్యామ్‌ల మరమ్మతులు, అభివృద్ధి, పునరావాసం కోసం రూ.10,211 కోట్లు వెచ్చించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వర్చువల్‌గా సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే మొదటి దశలో భాగంగా ఏడు రాష్ట్రాల్లో 223 ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే రెండూ, మూడు దశల్లో మరిన్ని డ్యామ్‌లను అభివృద్ధి చేయనుంది.
అవకాశం ఉన్న జలాశయాల వద్ద పర్యటక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు నాలుగు శాతం మేర నిధులను కేంద్రం ఖర్చు చేయనుంది.
జనపనార సంచుల వాడకం తప్పనిసరి...
జనపనార పరిశ్రమకు చేయూతనిచ్చే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార ధాన్యాల నిల్వకు జనపనార సంచుల వాడకం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో నాలుగు లక్షల మంది కార్మికులకు, వేలాది రైతులకు లబ్ధి చేకూరనుంది.
ఇథనాల్ ధర పెంపు...
చెరకు రైతులకు లబ్ధి చేకూరేలా ఇథనాల్ పై ధరను ఐదు నుంచి ఎనిమిది శాతానికి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. చెరకు రైతులు, చక్కెర పరిశ్రమల నుంచి సేకరించే ఇథనాల్ ధరను లీటర్‌కు 3రూపాయల 50 పైసలు, బి-హెవీ రకం ఇథనాల్ లీటర్ ధరను 3రూపాయల 35పైసలు, సీ-హెవీ రకం ఇథనాల్ ధర లీటర్‌కు 2రూపాయలు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు.