ప్రధానమంత్రి పంటల బీమా యోజనలో భారీ మార్పులు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం... ఈ పథకంలో రైతులు చేరాలా వద్దా అన్నది ఐచ్ఛికం చేస్తూ నిబంధనలను సడలించింది. ఇప్పటి వరకు రుణాలు తీసుకున్న రైతులు కచ్చితంగా ఇందులో చేరాలనే నిబంధన ఉంది. అయితే ఈ పథకం అమలులో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా తాజా మార్పులు చేసింది.
ప్రధానమంత్రి పంటల బీమా యోజన విషయంలో ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం చెల్లించే ప్రీమియం వాటాను 50 శాతం నుంచి 90శాతానికి పెంచినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.
పాడి రైతులకోసం పథకం
పాడి రైతులకు మేలు చేసేలా రూ.4వేల 558 కోట్లతో కొత్త పథకానికి కూడా మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. 22వ న్యాయ కమిషన్ ఏర్పాటు సహా మొత్తం 13 నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. గర్భస్త పిండాల అమ్మకం, అక్రమ రవాణా చేసే వారికి జరిమానా, జైలు శిక్ష విధించేలా పునరుత్పత్తి సహాయ సాంకేతిక నియంత్రణ బిల్లుకు సైతం మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.