సీఏఏ చట్టం ప్రాథమిక హక్కులను ఎంతమాత్రమూ హరించదని సుప్రీంకోర్టుకు సమాధానమిచ్చింది కేంద్రం. పౌరచట్టాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లకు సమాధానంగా 129 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున హోంశాఖ డైరెక్టర్ బీసీ జోషి కోర్టుకు హాజరయ్యారు.
రాజ్యాంగ నైతికతను, మౌలిక స్వభావాన్ని దెబ్బతీసే అంశాలు సీఏఏలో లేవని వెల్లడించింది. పౌరచట్టం ద్వారా కేంద్రప్రభుత్వానికి ఏకపక్ష అధికారాలు సంక్రమించవని తన సమాధానంలో స్పష్టం చేసింది. సీఏఏ ద్వారా ఎవరి పౌరసత్వం రద్దు కాదని.. పొరుగుదేశాలు బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ల్లోని మతపరమైన మైనారిటీలకు నూతన చట్టం ప్రకారం భారత పౌరసత్వాన్ని కల్పిస్తామని విశదీకరించింది.
పార్లమెంట్ పరిధిలోనిది..
సీఏఏ.. పార్లమెంట్ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని పేర్కొంది కేంద్రం. దీనిని సుప్రీంకోర్టులో సవాలు చెయ్యలేమని అభిప్రాయపడింది. ఆయా దేశాల్లోని మతపరమైన మైనారిటీలకు పౌరసత్వం కల్పించే హక్కు పార్లమెంట్‌కు ఉందని తన సమాధానంలో ఉద్ఘాటించింది కేంద్రం.
సీఏఏ పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తోందని పేర్కొంటూ భారత ముస్లిం లీగ్ 100కు పైగా పిటిషన్లను దాఖలు చేసింది. కొంతమంది వలసదారులకు మాత్రమే భారత పౌరసత్వాన్ని కల్పించడం సమానత్వ హక్కుకు భంగం కలిగినట్లేనని తన పిటిషన్లలో పేర్కొంది. ఈ నేపథ్యంలో సీఏఏపై వివరణ ఇస్తూ కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం.
ఇదీ చూడండి: కరోనా భయంతో స్వీయ నిర్బంధంలో కేంద్రమంత్రి!