జమ్ముకశ్మీర్ పూంఛ్ జిల్లాలో నివసించే ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల బలగాల మధ్య భీకర కాల్పులు జరగడమే దీనికి కారణం. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడం, భారత బలగాలు దీటుగా బదులివ్వడం ఇక్కడ సర్వ సాధారణం. ఒక్కోసారి పాక్ బలగాల కాల్పుల్లో సాధారణ ప్రజలూ మరణిస్తుంటారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని విపత్కర పరిస్థితి వీరిది.
వీరి ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు భారత ప్రభుత్వం ఓ పరిష్కార మార్గాన్ని కనుగొంది. నివాస ప్రాంతాలకు సమీపంలో భూగర్భ రక్షణ గృహాలను(బంకర్లు) నిర్మిస్తోంది.
ప్రమాదకర సమయాల్లో ప్రజలు బంకర్లలో తలదాచుకుంటారు. పరిస్థితి శాంతించాక తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. సరిహద్దు ప్రజల ప్రాణాలకు బంకర్లు రక్షణ కవచంలా మారాయి.
"మేము సరిహద్దు ప్రాంతంలో నివాసముంటాం.. ఇక్కడి నుంచి పాకిస్థాన్ భూభాగానికి అర కిలోమీటరు దూరం.. ఇక్కడ కాల్పులు తరచూ జరుగుతుంటాయి. కొన్ని సార్లు రాత్రి సమయాల్లో, మరికొన్ని సార్లు పగటి వేళల్లో. ఇరు దేశాల బలగాలు పరస్పరం కాల్పులు జరుపుకుంటారు. మాకు కాల్పుల శబ్దాలు వినిపించగానే పిల్లల్ని తీసుకుని బంకర్లలోకి పరుగెత్తి తలదాచుకుంటాం. గంటల పాటు అక్కడే ఉండి పరిస్థితి శాంతించాక తిరిగి ఇళ్లకు చేరుకుంటాం. రక్షణ గృహాన్ని నిర్మించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇలాంటి గృహాలను అందరికీ నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. "
-మహ్మద్ జహంగీర్, స్థానికుడు
"పిల్లలందరం బంకర్ల వైపు పరుగులు తీస్తాం.. కాల్పులు తరచుగా జరుగుతున్నాయి. పాఠశాలకు వెళ్లలేక పోతున్నాం.. భారత్-పాక్ ప్రభుత్వాలు చర్చలు జరిపి కాల్పులు నిలిపివేయాలి. శాంతిని నెలకొల్పాలని కోరుకుంటున్నాం."
-మహ్మద్ ఫిరీద్, విద్యార్థి