గ్రామీణ భారత అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. గత ఐదేళ్లలో గ్రామీణ వికాసానికి చేపట్టిన కార్యక్రమాలను బడ్జెట్ ప్రసంగంలో గుర్తుచేశారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా లక్షల ఊళ్లను బహిరంగ మల విసర్జన రహితంగా మార్చామని స్పష్టం చేశారు నిర్మల.
"స్వచ్ఛ భారత్ అభియాన్ దేశంలోని మూలమూలలకు వ్యాపించి, ఎన్నో ప్రయోజనాలు చేకూర్చింది. 2014లో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా 9.60 కోట్ల మరుగుదొడ్లను స్వచ్ఛ భారత్ కింద నిర్మించాం. 5.6 లక్షల గ్రామాలు బహిరంగ మల విసర్జన రహితంగా మారాయి. ప్రజల్లో మార్పును గమనించడమే కాదు... అధునాతన సాంకేతికత ద్వారా గ్రామాల్లో చెత్త నుంచి విద్యుత్ తయారీ చేయడానికి సంకల్పించాం. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామాల్లో చెత్త నిర్వహణ వ్యవస్థను ప్రవేశపెట్టాం.
'ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్' ద్వారా 2 కోట్లమంది గ్రామీణ పౌరులను డిజిటల్ అక్షరాస్యులుగా మార్చాం. గ్రామీణ, పట్టణాల మధ్య డిజిటల్ వంతెనను నిర్మించేందుకు ప్రతి పంచాయతీలో అంతర్జాల సేవలు ఏర్పాటు చేయనున్నాం. ఈ కార్యక్రమం అంతర్జాతీయ సేవా నిధి ద్వారా పీపీపీ విధానంలో చేపట్టనున్నాం."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
ఇదీ చూడండి: పద్దు 2019: అంకురాల ఆశలకు కాస్త దగ్గరగా...