కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం గద్దె దిగటానికి కారణమైన 17 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు వ్యవహారం పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు తెలుసంటూ భాజపా కార్యకర్తలతో ముఖ్యమంత్రి యడియూరప్ప మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయ అలజడి సృష్టిస్తోంది.
17 మంది ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించి సభలో బలపరీక్షకు హాజరుకాకుండా ముంబయిలోని 5 నక్షత్రాల హోటల్లో బస చేయటానికి అన్ని ఏర్పాట్లు కూడా అమిత్ షానే చేశారని.. అన్ని విషయాలు ఆయనకే తెలుసని ఆడియో టేప్‌లో ఉంది.
ఈ ఆడియో విషయపై యడియూరప్పను ప్రశ్నించగా.. హుబ్లీ నియోజకవర్గం గురించే తాను మాట్లాడానని, బాధ్యత గల కార్యకర్తలెవ్వరూ అలా మాట్లాడకూడదని చెప్పానని అన్నారు.
కోర్టును ఆశ్రయిస్తాం..
ముఖ్యమంత్రి మాట్లాడిన ఆడియో ద్వారా భాజపా వైఖరి బయటపడిందని విమర్శించారు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. ఆడియో ఆధారంగా కోర్టులో కేసు వేస్తామని తెలిపారు. ఆడియోలో ఉన్న సమాచారాన్ని కోర్టుకు అందిస్తామని చెప్పారు.
గవర్నర్‌కు ఫిర్యాదు..
ముఖ్యమంత్రి ఆడియో టేప్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య. కర్ణాటక ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరినట్లు చెప్పారు. ఈ విషయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. భాజపా తీరు రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ఆరోపించారు.
ఇదీ చూడండి: 'వర్షంలో తడిస్తేనే రాజకీయంలో మంచి భవిష్యత్తు'