మధ్య వయస్కులైన మహిళలను అత్యాచారం చేసి ఆపై హత్యకు పాల్పడుతున్న కిరాతకుడిని అరెస్ట్ చేశారు బంగాల్ పోలీసులు. తూర్పు బుర్ద్వాన్ జిల్లాలో ఈ వరుస ఘటనలకు పాల్పడ్డాడు నిందితుడు కమారుజుమన్ సర్కార్. కల్నాలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఈ నిందితుడు ఇప్పటి వరకు 6 హత్యలు చేశాడు.
ఇలా హత్యలు చేస్తాడు..
42 ఏళ్ల కమారుజుమన్ సర్కార్ పాత వస్తువులు కొని అమ్మే చిన్న వ్యాపారి. ఖరిదైన వస్త్రాలు ధరించి మధ్యాహ్నం వేళల్లో... విద్యుత్ మీటరు రీడింగ్ చూసే నెపంతో ఇళ్లలోకి చొరబడతాడు. అనంతరం మధ్య వయస్కులైన ఒంటరి మహిళలపై సైకిల్ చైన్, ఇనుపరాడ్లను ఉపయోగించి హత్య చేస్తాడు. హత్యానంతరం ఈ నరరూప రాక్షసుడు మృతుల శవాలపై అత్యాచారానికి పాల్పడినట్లు తేల్చారు పోలీసులు. మరి కొన్ని కేసుల్లో మృతుల మర్మావయవాల్లో పదునైన వస్తువులను దూర్చినట్లు తెలిపారు పోలీసులు. నిందితుడు ప్రధానంగా హూగ్లీ, బుర్ద్వాన్ జిల్లాల్లో ఈ తరహా హత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
మే 21న గోరా గ్రామంలో జరిగిన పుతుల్ మజ్హి అనే మహిళ హత్య కేసులో... నిందితునికి జిల్లా న్యాయస్థానం 12 రోజుల రిమాండ్ విధించింది.
అతని ఉద్దేశం దొంగతనం కాదు..
హంతకుడు సర్కార్ కొన్ని ఇళ్లలోని విలువైన వస్తువులు దొంగతనం చేశాడు. అయితే అతని ఉద్దేశం మాత్రం దొంగతనం కాదని, మధ్య వయస్కులైన మహిళలను చంపడమే అతని ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.
మహిళలపై కక్షతోనే..
నరహంతకుడు సర్కార్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యక్తిగత కక్షలతోనే మహిళలపై హత్యలకు పాల్పడుతుండవచ్చనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పట్టించిన ఎర్రబండి
నిందితుడు ఎర్రని మోటార్‌బైక్‌పై ఎర్రని శిరస్త్రాణం ధరించి వెళ్తున్నాడనే సమాచారం అందుకున్న పోలీసులు, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా అతనిని బుర్ద్వాన్ జిల్లా కల్నా వద్ద అరెస్టు చేశారు.
రక్త చరిత్ర సృష్టించాడు
సర్కార్ జనవరి 27న అనుకల్ ప్రాంతంలో పుష్పాదాస్ అనే మహిళను హత్యచేశాడు. ఏప్రిల్ 4న రీటారాయ్, మమతా కిష్కులను గంటల వ్యవధిలోనే కడతేర్చాడు. మిమేరీ ప్రాంతంలో సోనీయాదవ్ను ఇదే రీతిలో హత్యచేశాడని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: పెట్రో ధరలపై కేంద్ర మంత్రుల సమీక్ష