బాడీ బిల్డింగ్‌లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఓ యువకుడు 'డైట్' అంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కృత్రిమ డైట్‌ను ఆనుసరిస్తూ రెండు కిడ్నీలను పాడు చెసుకున్నాడు. ఇది మహారాష్ట్రలోని బుల్ బజార్‌కు చెందిన శ్రిదీప్ గౌడ్ కథ.
అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ పోటీల్లో ఎన్నో పతకాలు సాధించిన శ్రిదీప్.. జిమ్‌లో చాలా కసరత్తులు చేసేవాడు. కండలు తిరిగిన దేహంతో కనిపించాలని కృత్రిమ డైట్‌ను అనుసరించడం మొదలుపెట్టాడు. అయితే కొన్ని కారణాల వల్ల డైట్‌ను అపేశాడు. ఎక్కువ రోజులు ఉండలేక తిరిగి అదే డైట్‌ను ప్రారంభించాడు.
అప్పుడే అతనికి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఓ రోజు శరీరంలో రక్తపోటు పడిపోయి వాంతులు చేసుకున్నాడు. శ్రీదీప్ను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. అతనికి రెండు కిడ్నీలు పాడైపోయాయని వైద్యులు తెలిపారు.
అవి ఎప్పటికీ ప్రమాదమే
కండలు తిరిగే దేహం కోసం చాలామంది అధిక సమయం వ్యాయామాలు చేస్తుంటారని, కృత్రిమ డైట్ వల్ల వచ్చే పర్యవసానాల గురించి ఆలోచించరని డాక్టర్లు చెబుతున్నారు. మార్కెట్లో దొరికే కృత్రిమ ప్రొటీన్లు, పిల్స్‌ను ఉపయోగించడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తి చివరకు అవయవం పనిచేయడం ఆగిపోతుందని హెచ్చరిస్తున్నారు.