భారత్- చైనా మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్త పరిస్థితులపై విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. ఉద్రిక్తతలకు కారణం చైనా అనుసరిస్తున్న తీరేనని మండిపడ్డారు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవా. సరిహద్దులను చైనా ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నించడం వల్లే.. నాలుగు నెలలుగా తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభన నెలకొందన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్ కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇరుదేశాల ముందున్న మార్గం ఇదేనని అభిప్రాయపడ్డారు.
"తూర్పు లద్దాఖ్‌లో నాలుగు నెలలుగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులకు కారణం చైనా. ఆ దేశం ఏకపక్షంగా సరిహద్దులు మార్చేందుకు ప్రయత్నించడం వల్లే ఈ ప్రతిష్టంభన ఏర్పడింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు భారత్‌తో చర్చలకు రావాలని కోరుతున్నాం"
-- అనురాగ్ శ్రీవాస్తవా, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) కవ్వింపు చర్యలకు పాల్పడిందని పేర్కొన్నారు శ్రీవాస్తవా. ఇరు దేశాల గ్రౌండ్ కమాండర్ల సమావేశానికి ఒక రోజు ముందు ఈ చర్యలకు పాల్పడిందని తెలిపారు. చైనా చర్యలను గమనించిన భారత ఆర్మీ... పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలోని మూడు కీలక ప్రాంతాల్లో బలగాలను పెంచిందని స్పష్టం చేశారు.
తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో ఆగస్ట్ 29, 30 తేదీల్లో చైనా ఘర్షణకు దిగిందని పేర్కొంది భారత ఆర్మీ. ఎల్ఏసీ వద్ద యథాతథ స్థితిని మార్చడానికి.. చైనా కవ్వింపుతో కూడిన సైనిక మోహరింపులు చేపట్టినట్లు స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ఏకపక్షంగా మార్చాలన్న చైనా ఉద్దేశాలను అడ్డుకున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు.
అవును.. వెళ్తున్నారు
మాస్కో వేదికగా జరగనున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల భేటీలో ఎస్ జయ్శంకర్ పాల్గొననున్నట్లు స్పష్టం చేశారు శ్రీవాస్తవా. సెప్టెంబర్ 10న ఈ సమావేశం జరగనుంది. ఎస్సీఓలో భారత్, చైనా సహా మొత్తం ఎనిమిది దేశాలు సభ్యులుగా ఉన్నాయి.