బోఫోర్స్ కుంభకోణం కేసు దర్యాప్తును నీరుగార్చింది అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలేనని సీబీఐ మాజీ అధిపతి ఆర్.కె.రాఘవన్ (79) అభిప్రాయపడ్డారు. వాస్తవాలతో కూడిన కేసులపై విచారణ జరగకుండా ప్రభుత్వాలు ఎలా కుట్రలు పన్నుతాయో చెప్పడానికి ఇదే ఉదాహరణ అని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణం వెలుగు చూసింది. స్వీడన్‌కు చెందిన ఆయుధాల తయారీ సంస్థ బోఫోర్స్ నుంచి రూ.1,437 కోట్లు విలువ చేసే హొవిడ్జర్ శతఘ్నులు కొనుగోలు చేయడానికి 1986లో ఒప్పందం కుదిరింది. అనంతరం ఆ సంస్థ రూ.64 కోట్లు లంచంగా చెల్లించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ సొమ్ము కొందరు రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నేతలు, అధికారులకు ముడుపులుగా వెళ్లినట్టు 1988లో సీబీఐ కేసు నమోదు చేసింది. 1999 జనవరి 4 నుంచి 2001 ఏప్రిల్ 30 వరకు సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన రాఘవన్ ఈ కేసుపై దర్యాప్తు చేశారు. ఆ నాటి విషయాలను ఇటీవల రాసిన తన ఆత్మకథ 'ఏ రోడ్ వెల్ ట్రావెల్డ్'లో ప్రస్తావించారు.
కాంగ్రెస్ మద్దతుతో 1990-1991 మధ్య పనిచేసిన చంద్రశేఖర్ ప్రభుత్వం, 1991-96నాటి పీవీ నరసింహారావు సర్కారు, 2004-14 మధ్య ఉన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దర్యాప్తును ముందుకు సాగనీయలేదని తెలిపారు. అయితే ఈ లంచం సొమ్ము రాజీవ్ గాంధీకి, కాంగ్రెస్ నాయకులకు అందినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టంచేశారు. ఈ కేసుపై తొలుత రాజీవ్ గాంధీయే దర్యాప్తునకు ఆదేశించినా, అది మరకలపై సున్నం పూసే ప్రయత్నంలాంటిదని వ్యాఖ్యానించారు. ఈ కేసులో లంచం విలువ రూ.64 కోట్లు కాగా, దర్యాప్తునకు రూ.250 కోట్లు వరకు ఖర్చయింది. అయినా దోషులెవరో తేలకపోవడంతో ఇంకా ప్రజాధనాన్ని వృథా చేయడం మంచిదికాదని చెప్పి 2011లో కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. దీనిపై సీబీఐ 2018లో సుప్రీంకోర్టుకు అపీలు చేయగా, బాగా ఆలస్యంగా వచ్చారంటూ సర్వోన్నత న్యాయస్థానం కూడా తిరస్కరించింది.
'అక్రమంగా సంపాదించిన వారు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకొనే యత్నాలు చేస్తున్నారు. ఇందుకు మధ్యశ్రేణి న్యాయవ్యవస్థ సహకరిస్తుండడం క్రిమినల్ న్యాయవ్యవస్థతీరు ఎలా ఉందో చెబుతోంది' అని రాఘవన్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'మార్పు రాకపోతే ఐరాస విశ్వసనీయతకే ముప్పు'