ప్రస్తుతం ఉన్న రక్తదాన నిబంధనలను క్రమబద్ధీకరిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కొత్త నిబంధనలు జారీచేసింది. ఇక మీదట బ్లడ్ బ్యాంకులను బ్లడ్ సెంటర్స్‌గా పిలవాలని పేర్కొంటూ డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ నిబంధనలను సవరిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ బ్యాంకులను బ్లడ్ సెంటర్స్‌గా పిలుస్తున్నందున దేశంలోనూ ఆమేరకు సవరణ చేశారు. తాజా సవరణలపై నిబంధనలకు అనుగుణంగా ప్రజాభిప్రాయసేకరణ చేసిన తర్వాత నోటిఫై చేశారు. రక్తదాతలకు కనిష్ఠంగా 18 ఏళ్లు, గరిష్ఠంగా 65 ఏళ్లు ఉండాలని ఇందులో నిర్దేశించారు.
రక్తదానంపై మార్గదర్శకాలు
తొలిసారి రక్తదానం చేసే వ్యక్తి వయస్సు అయితే 60 ఏళ్లకు మించకూడదని, పదేపదే చేసేవారి వయస్సు అయితే 65 ఏళ్లు మించకూడదని పేర్కొన్నారు. రక్తదానానికి 104 మార్గదర్శకాలు నిర్దేశించారు. విదేశీయులు వరుసగా మూడేళ్లు భారత్‌లో ఉంటేనే వారి నుంచి రక్తం దానంగా స్వీకరించాలన్న నిబంధన పెట్టారు. పళ్లు పీకించుకున్నవారు కూడా 6 నెలల తర్వాతే రక్తదానం చేయాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. మహిళలు కాన్పు తర్వాత 12 నెలలపాటు, అబార్షన్ తర్వాత 6 నెలలపాటు రక్తదానం చేయకూడదని నిర్దేశించింది.
ఇదీ చూడండి : దేశంలో 74కు చేరిన కరోనా కేసులు.. చర్యలు ముమ్మరం