మహారాష్ట్ర శాసనసభకు అక్టోబర్ 21న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార భారతీయ జనతా పార్టీ.. అభ్యర్థుల జాబితాను నేడు విడుదల చేయనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
"ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చించి అభ్యర్థుల జాబితాపై తుది నిర్ణయం తీసుకుంటాం."
-పార్టీ వర్గాలు
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఆదివారం దిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. ప్రధానితో భేటీ అనంతరం తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే పలువురు ఆశావహులు ప్రభుత్వ కార్యాలయాల నుంచి నామపత్రాలను సేకరించారని తెలుస్తోంది.
తొలిరోజు 14 నామినేషన్లు...
నామపత్రాల దాఖలు ప్రక్రియ ప్రారంభమైన శుక్రవారం 14 మంది ఆశావహులు తమ దరఖాస్తులను సమర్పించారు. నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు భాజపా, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
బాలాపుర్, తూర్పు నాశిక్, ఉత్తర నాందేడ్ , దక్షిణ నాందేడ్ , కన్నడ్, తూర్పు ఔరంగాబాద్, ఇందాపుర్, వాడ్గావ్-షేరీ, పందార్పుర్, పరండా, మిరాజ్, అక్కల్కోట్, ఆర్మోరీ, అహేరిల నుంచి ఒక్కో నామినేషన్ వచ్చిందని అధికారులు వెల్లడించారు.
నామినేషన్ దాఖలుకు చివరి తేది అక్టోబర్ 4. దరఖాస్తుల పరిశీలన 5వ తేదిన జరుగుతుంది. 7వ తేదిలోగా ఉపసంహరించుకోవడానికి అవకాశమిచ్చారు.
ఇదీ చూడండి: 'ఐదేళ్లలో భారత్కు అంతర్జాతీయ ప్రాధాన్యం పెరిగింది'