బంగాల్లోని పశ్చిమ మేదినీపుర్ జిల్లాలో భాజపా, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో భాజపా కార్యకర్త ఒకరు మరణించారు. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతారణం నెలకొంది.
ప్రణాళిక ప్రకారమే..!
విశ్వకర్మ పూజ వేడుకల్లో జిల్లాలోని సబాంగ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో దీపక్ మొండల్ అనే వ్యక్తి మృతిచెందాడు. 'మొండల్ ఆ ప్రాంతంలో ప్రజాదరణ గల వ్యక్తి. అందుకే ప్రణాళిక ప్రకారమే హత్య చేశారు' అని స్థానిక భాజపా నేత ఆరోపించారు. మొండల్ హత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని జిల్లాలో పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగారు భాజపా కార్యకర్తలు.
అల్లర్లు సృష్టించడానికే..!
మోయనా ప్రాంతానికి చెందిన మొండల్.. అల్లర్లు సృష్టించడానికే సబాంగ్ వెళ్లాడని స్థానిక టీఎంసీ నేత ఆరోపించారు. మొండల్ తీసుకువెళ్తున్న బాంబు పేలి, మృతి చెందాడన్నారు.
ఈ ఘటనతో జిల్లాలో నెలకొన్న ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'వ్యవసాయ బిల్లులతో రైతుల జీవితాల్లో మార్పులు తథ్యం'