పశ్చిమ బంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. భాట్‌పారాలో భాజపా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడులకు దిగారు. నాటు బాంబులు విసురుకున్నారు. ఈ అల్లర్లలో పలువురు గాయపడ్డారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి అల్లరి మూకలను చెదరగొట్టారు.
భాజపా బృందం పర్యటన
గత గురువారం ఈ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఇద్దరు మృతి చెందారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని భాజపా హైకమాండ్ పార్టీ నేతలను ఆదేశించింది. దీంతో కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎస్ అహ్లూవాలియా నేతృత్వంలో ఎంపీలు సత్యపాల్ సింగ్, బీడీ రామ్‌ల బృందం భాట్‌పారా ప్రాంతాన్ని సందర్శించింది.
భాట్‌పారా ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల మరణానికి పోలీసుల కాల్పులే కారణమని ఆరోపించింది భాజపా బృందం. పోలీసులు ఉపయోగించిన తూటాలను పరిశీలించింది. బంగాల్‌లో పరిస్థితులపై భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపింది.
144 సెక్షన్...
భాజపా నాయకులు వెళ్లిపోయిన వెంటనే మళ్లీ అల్లర్లు చెలరేగాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో భాట్‌పారాలో 144 సెక్షన్ విధించారు.