పశ్చిమ బంగాల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా పుంజుకుంది. ఊహించని విధంగా తృణమూల్ కాంగ్రెస్ను 22 స్థానాలకే పరిమితం చేసింది. ఎన్నికల్లో టీఎంసీ విఫలం చెందిన అనంతరం ఆ పార్టీ అధినేత్రి మమత బెనర్జీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు కాషాయ పార్టీ కార్యకర్తలు. దీదీ ఎక్కడికి వెళ్లినా 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేస్తూ... పుండుమీద కారం చల్లుతున్నారు.
తాజాగా మరోమారు వినూత్న నిరసనకు తెరతీశారు కాషాయ నేతలు. బంగాల్లో భాజపా కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా... ముఖ్యమంత్రి మమత ఇంటికి 10 వేల 'జై శ్రీరామ్ పోస్టుకార్డు'లను పంపించనున్నట్లు భాజపా నేత అర్జున్ సింగ్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి భాజపాలో చేరారు సింగ్.
జై శ్రీరామ్ నినాదాలకు 'లాఠీచార్జీ'
ఇటీవల పర్గనాస్ జిల్లా కంచ్రపారలో టీఎంసీ నాయకుల సమావేశం జరిగింది. ఈ ప్రదేశానికి సమీపంలో భాజపా కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ నినాదలు చేశారు. వారిపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. పోలీసుల తీరును ఖండిస్తూ పోస్టుకార్డులతో నిరసన తెలుపుతున్నట్లు సింగ్ ప్రకటించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
లోక్సభ ఎన్నికల్లో మొత్తం 42 స్థానాలకు గాను 18 సీట్లు భాజపా కైవసం చేసుకుంది. టీఎంసీకి 22 స్థానాలకే పరిమితమైంది. అనంతరం కొంత మంది టీఎంసీ నాయకులు భాజపా గూటికి చేరారు.
ఇదీ చూడండి: రక్షణ వ్యవహారాలపై రాజ్నాథ్ సమీక్ష