హరియాణాలో అక్టోబరు 21న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది భాజపా. 78 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. కర్నాల్ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో నిలవనున్నారు హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. హరియాణా భాజపా అధ్యక్షుడు సుభాశ్ బరాలా.. టోహానా నుంచి పోటీ చేయనున్నారు.
జాబితాలో ముగ్గురు క్రీడాకారులకు చోటు కల్పించింది భాజపా. రెజ్లర్లు యోగేశ్వర్ దత్.. బరోడా నుంచి పోటీ చేయనున్నాడు. భారత హాకీ జట్టు మాజీ సారథి సందీప్ సింగ్ పెహోవా నుంచి, మహిళా రెజ్లర్ బబితా పొగాట్ దాద్రి నుంచి బరిలోకి దిగనున్నారు.
నిన్న దిల్లిలో జరిగిన పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో హరియాణా నుంచి ప్రస్తుత ఎమ్మెల్యేలలో 38 మందికి మళ్లీ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు భాజపా జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. ఏడుగురిని పోటీ నుంచి దూరంగా ఉంచుతున్నట్టు చెప్పారు.
కేంద్ర మాజీ మంత్రి, జాట్ల నాయకుడు బీరేందర్ సింగ్ సతీమణి ఉచానా నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారు. 2014లోనూ ఆమె అదే స్థానం నుంచి గెలుపొందారు.
హరియాణాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 90. అక్టోబరు 21న మహారాష్ట్రతో పాటు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబరు 24న ఫలితాలు వెలువడుతాయి.
ఇదీ చూడండి: దిల్లీ హైకోర్టులో చిదంబరానికి చుక్కెదురు