రాజకీయ పార్టీల నిబంధనల రేఖను చెరిపేస్తూ.. అధికార, విపక్ష పార్టీలు ఏకతాటిపై నిలిచిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో మంగళవారం చోటు చేసుకుంది. భాజపా ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జార్.. అవినీతి అధికారులపై చర్యల అంశాన్ని లేవనెత్తగా స్పీకర్ నిరాకరించటాన్ని నిరసిస్తూ.. ధర్నాకు దిగారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. వీరికి మద్దతుగా విపక్షాలూ ధర్నాలో పాల్గొన్నాయి. స్వపక్ష, విపక్ష పార్టీల నిరసనలతో సభ మరుసటి రోజుకు వాయిదా పడింది.
160 మందికిపైగా..
గాజియాబాద్ ఎమ్మెల్యే గుర్జార్ సన్నిహితులు కొందరు ఇటీవలే అధికారులతో గొడవపడి అరెస్టయ్యారు. అనంతరం సంబంధిత అధికారులపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు గుర్జార్. ఇదే విషయాన్ని సభలో ప్రస్తావించడానికి ప్రయత్నించారు. చర్చ చేపట్టాలని కోరారు. కానీ.. స్పీకర్ అందుకు అంగీకరించకపోవడం వల్ల సభలో వాతావరణం వేడెక్కింది. సుమారు 160 మందికిపైగా అధికార పక్ష ఎమ్మెల్యేలు గుర్జార్‌కు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు.
విపక్షాల మద్దతు..
గుర్జార్‌కు మద్దతు తెలిపారు విపక్ష సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలు. ధర్నాలో పాల్గొన్నారు. సభలో మాట్లాడే హక్కు ప్రతి ఎమ్మెల్యేకు ఉందని నినాదాలు చేశారు. అయినా స్పీకర్ మాట్లాడేందుకు అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో సభ పలుమార్లు వాయిదా పడింది.
సభ పునఃప్రారంభమైనప్పటికీ సజావుగా సాగలేదు. సభ్యుల ఐక్యత వర్థిల్లాలని, రోజంతా సభను వాయిదా వేయాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో సభను ఒకరోజుపాటు వాయిదా వేశారు. ఈ విధంగా ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే వల్ల శాసనసభ వాయిదా పడటం ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.
యోగి రాజీనామా చేయాలి..
ఒక ఎమ్మెల్యే లేవనెత్తిన సమస్యపై చర్చ జరగకపోవటం వంటిది ఉత్తర్‌ప్రదేశ్ చరిత్రలోనే జరగలేదని విమర్శించారు సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోవింద్. అవినీతి అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే నేడు మరోమారు ధర్నా చేపడతామని వెల్లడించారు. 1979లో ఇలాంటి అంశమే తెరపైకి వస్తే అధికారులపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు గోవింద్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 169 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని.. యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గుర్జార్‌ను సముదాయించేందుకు ప్రయత్నాలు..
సభలో నిరసనలు చేపట్టిన ఎమ్మెల్యే గుర్జార్‌ను సముదాయించేందుకు భాజపా అగ్రనేతలు ప్రయత్నాలు చేపట్టారు. ఎమ్మెల్యేలతో స్పీకర్ భేటీ అయ్యి.. సభ్యుల హక్కులకు భంగం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కానీ.. హామీని నెరవేర్చకుంటే మరోమారు ధర్నా చేపడతామని హెచ్చరించాయి విపక్షాలు.
వార్తల్లో గుర్జార్...
గుర్జార్ ఇటీవలి కాలంలో అనేక మార్లు వార్తల్లో నిలిచారు. ఆయన కుమారుడు(మైనర్) ఓ రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఎన్నికల అధికారులతోనూ గుర్జార్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి. ఓ ఆహారశాఖ అధికారిపై దాడి చేశారన్న ఆరోపణలతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు గుర్జార్‌కు నోటీసులు జారీ చేశారు. తనను హత్య చేయడానికి పార్టీలోని కొందరు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు గుర్జార్.
ఇదీ చూడండి: ఆర్టికల్ 370 రద్దు దెబ్బ.. కశ్మీరానికి భారీ నష్టం!