దేశాన్ని విభజించడానికి మాత్రమే భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోందని విమర్శలు గుప్పించారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. అందుకే క్రిస్మస్ రోజు సెలవును ప్రభుత్వం రద్దు చేసిందని ధ్వజమెత్తారు. కోల్కతా పార్క్స్ట్రీట్ ప్రాంతంలోని అలెన్ పార్క్ వద్ద క్రిస్మస్ వేడుకలను ప్రారంభించిన టీఎంసీ అధినేత్రి.. మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
"క్రీస్తు పుట్టినరోజు ఎందుకు జాతీయ సెలవుదినం కాదు? భాజపా ప్రభుత్వం దానిని ఎందుకు ఉపసంహరించుకుంది? ప్రతి ఒక్కరికీ మనోభావాలు ఉంటాయి. క్రైస్తవులు ఏ హాని చేశారు? భారత్లో లౌకికవాదం ఉందా? మత విద్వేష రాజకీయాలు జరుగుతున్నాయి" అని మమత తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. "కొంతమంది దేశాన్ని విభజించడం మాత్రమే చేయగలరు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిస్మస్ రోజున ప్రభుత్వం సెలవుదినాన్ని రద్దు చేసింది. వారు ఎందుకు అలా చేశారు? క్రైస్తవుల మనోభావాలను పట్టించుకోరా?" అంటూ కమల దళంపై విరుకుపడ్డారు మమత.
'క్రిస్మస్ను అందరూ జరుపుకుంటారు. బంగాల్లో దుర్గాపూజ, ఈద్, క్రిస్మస్ సమాన ఉత్సహంతో జరుగుతాయి. రాజ్యాంగాన్ని అందరూ గౌరవిస్తారు. అయితే కమలం పార్టీకి రాజ్యాంగం పట్ల ఎలాంటి ప్రమాణాలు, విలువలు లేవు' అని ఆరోపించారు మమత.
ఇదీ చూడండి: వచ్చే ఏడాదిలోనే పుతిన్ భారత్ పర్యటన!