2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రభంజనం సృష్టించింది భాజపా. 80సీట్లలో మిత్రపక్షంతో కలిసి 73 స్థానాలు దక్కించుకుంది. మిగిలిన స్థానాలు దక్కింది రెండు కుటుంబాలకే... ఒకటి గాంధీ-నెహ్రూ పరివారం, మరొకటి ములాయం వంశం. అప్పుడు విడివిడిగా పోటీచేశాయి ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ. సమాజ్‌వాదీ పార్టీ అతికష్టం మీద 5 సీట్లు సాధిస్తే... బహుజన సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ అసలు ఖాతా తెరవలేదు.
సీట్లు పరంగా... ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉంది భాజపా. కానీ... ఇక్కడ సమస్య సీట్లు కాదు, ఓట్లు. 2014లో భాజపాకు వచ్చిన ఓట్ల శాతం 42.63. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీకి విడివిడిగా వచ్చి ఓట్లశాతాలు కలిపితే 42.98. ఇప్పుడు కలిసి ఒకే అభ్యర్థిని నిలబెడుతున్నాయి. అంటే... దాదాపు సమాన ఆదరణ. పోటీ హోరాహోరీ.
నువ్వానేనా అన్నట్లు జరుగుతున్న ఎన్నికల్లో... ప్రతి ఓటు కీలకమే. ప్రతి సీటు అవసరమే. అందుకే... అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది భాజపా. చిన్నపార్టీలను దగ్గర చేసుకుంటోంది. వారి డిమాండ్లలో సాధ్యమైనన్నింటికి పచ్చజెండా ఊపుతోంది. మరికొన్నింటిపై సానుకూలంగా స్పందిస్తూ... వారి మద్దతు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
అప్నాదళ్‌కు కుర్మీ వర్గం మద్దతు రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ఎస్బీఎస్పీకి ఓబీసీ వర్గానికి చెందిన రాజ్భర్ల ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఈశాన్య ఉత్తర ప్రదేశ్‌లో వీరి ప్రాబల్యం ఎక్కువ. ఆ పార్టీలతో కలిసి ఎన్నికలకువెళ్తే లాభమన్నది భాజపా అంచనా.
లోక్‌సభ ఎన్నికల్లో అప్నాదళ్‌తో పొత్తు కుదిరినా... ఎస్బీఎస్పీ సీట్ల కేటాయింపుపై చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఎస్బీఎస్పీకి పుర్వాంచల్ ప్రాంతంలో బాగా పట్టుంది. ఆ ప్రాంతంలోని స్థానాలను కేటాయించాలనే ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ఆ ప్రాంతంలోనిదే. జనసత్తా దళ్(లోక్తాంత్రిక్) పార్టీతోనూ పొత్తు కోసం ప్రయత్నిస్తోంది భాజపా.
వరాల జల్లు...
ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వంలో సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ), అప్నాదళ్(ఎస్) పార్టీలు భాగస్వాములు. అయినా... రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చన్న భావనతో.... ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది భాజపా. చిన్నపార్టీల నేతలకు మరో ఆలోచన రాకుండా మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు ఇచ్చింది.
భాజపా, మిత్రపక్షాలకు చెందిన 75మందికి ఇటీవలే సహాయ మంత్రి హోదా కల్పించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఎస్బీఎస్పీ నేత అరవింద్ రాజ్‌భర్‌ను రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల కార్పొరేషన్‌కు ఛైర్పర్సన్ చేశారు. ఈయన ఎస్బీఎస్పీ అధ్యక్షుడు, యూపీ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ కుమారుడు. ఎస్బీఎస్పీ నేత రానా ప్రతాప్ సింగ్‌కు యూపీ విత్తానాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ పదవి ఇచ్చారు.
అప్నాదళ్‌కు చెందిన రామ్‌లఖన్, రేఖావర్మ ఇప్పటికే యోగి కేబినేట్లో మంత్రులు. మరో ఇద్దరిని బీసీ కమిషన్ సభ్యులుగా నియమించింది యూపీ ప్రభుత్వం.
క్రమంగా తగ్గి... ఒకేసారి పైకి
1991 నుంచి 1999 మధ్య భాజపా ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 30శాతం ఓట్లు పొందింది. అది 2004లో 22శాతానికి పడిపోయింది. 2009కి మరింత క్షీణించింది. కేవలం 17.5శాతం ఓట్లతో సరిపెట్టుకుంది సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మోదీ ప్రభంజనం-అమిత్‌షా వ్యూహంతో భాజపా అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పుడు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం.