దేశంలో లక్షలాది ఉద్యోగాలు పోయే ప్రమాదంలో ఉంటే... భాజపా ప్రభుత్వం మౌనంగా ఉండటం 'అత్యంత ప్రమాదకరమని' కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలోని మందగమనం దృష్ట్యా 10 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని బుధవారం, 'భారత వాహన విడిభాగాల తయారీదార్ల సంఘం' (ఏసీఎమ్ఏ) హెచ్చరించింది.
మోదీ.. మౌనం ఎందుకు?
ఈ మీడియా నివేదికను తన ట్విట్టర్‌కు ట్యాగ్ చేసిన ప్రియాంకగాంధీ... మోదీ ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేశారు.
"వాహనరంగంలోని 10 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక ఈ రంగంలోని వ్యక్తులు కొత్త ఉద్యోగ మార్గాల కోసం వెతుక్కోవాలి. ఉద్యోగ నష్టాలు, వాణిజ్యం బలహీనపడడం, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధానాలపై భాజపా ప్రభుత్వం మౌనంగా ఉండటం చాలా ప్రమాదకరం." - ప్రియాంక గాంధీ
ప్రభుత్వం చేయూత నివ్వాలి
ఆటోమొబైల్ రంగంలో వాహన విడిభాగాల పరిశ్రమ ఒక్కటే 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో మందగమనం కొనసాగుతోంది. కనుక కంపెనీలు 15-20 శాతం వాహనాల ఉత్పత్తిని తగ్గించేస్తున్నాయి. ఈ సంక్షోభం కొనసాగితే 10 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగి ఆటోమొబైల్ రంగం మొత్తాన్ని 18 శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకురావాలని ఏసీఎమ్ఏ కోరుతోంది.
ఇదీ చూడండి: 'భారత్‌తో పాక్ పూర్తిస్థాయిలో యుద్ధం చెయ్యలేదు'