దేశంలో బర్డ్ ఫ్లూ క్రమంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు పది రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రల్లో సోమవారం ఫ్లూను నిర్ధరించినట్లు వెల్లడించింది. దీంతో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచనలు చేసింది. నీటి కుంటలు, పక్షుల మార్కెట్లు, 'జూ'లు, పౌల్ట్రీ ఫాంలపై పర్యవేక్షణ పెంచాలని స్పష్టం చేసింది. ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడాలని తెలిపింది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ, కేరళ, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్ రాష్ట్రాల తర్వాత బర్డ్ ఫ్లూ వ్యాపించిన ఎనిమిదో రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. పర్భణీ జిల్లాలో 800 కోళ్లు మరణించగా.. వాటి నమూనాలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు తేలింది. ముంబయి, ఠాణె జిల్లాల్లోనూ ఫ్లూ కేసులు నిర్ధరణ అయ్యాయి. నాగ్‌పుర్, లాతుర్ జిల్లాల్లోనూ పక్షుల మరణాలు కలవరపెడుతున్నాయి.
ఈ భయాల మధ్య మురుంబ గ్రామంలో ఉన్న కోళ్లను వధించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామంలోని ఎనిమిది పౌల్ట్రీ ఫాంలలో 8 వేల కోళ్లు ఉన్నాయి. ఇతర పక్షులు సైతం మరణిస్తున్న నేపథ్యంలో.. నమూనాలను పరీక్షలకు పంపించారు అధికారులు. మురుంబ గ్రామస్థులతో పాటు 10 కి.మీ పరిధిలో నివసించే ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని విక్రయించే చికెన్‌పై నిషేధం విధించారు.
దిల్లీలోనూ..
దిల్లీలో ఇటీవల మరణించిన పక్షులకు బర్డ్ ఫ్లూ ఉందని స్పష్టమైంది. భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపించిన ఎనిమిది నమూనాలు పాజిటివ్‌గా తేలాయి. మయూర్ విహార్ ఫేజ్ 3లోని పార్క్‌లో నాలుగు, సంజయ్ సరస్సు వద్ద మరణించిన మూడు పక్షుల నమూనాలు ఇందులో ఉన్నాయి. సంజయ్ పార్క్‌లో ఆదివారం మరో 17 బాతులు చనిపోయాయి. ఈ నేపథ్యంలో పార్క్ వద్ద ఉన్న బాతులను వధిస్తున్నారు.
బర్డ్ ఫ్లూ వ్యాప్తి దృష్ట్యా నగరం బయట నుంచి తీసుకొచ్చిన ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ చికెన్ అమ్మకాలపై దిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే చికెన్, గుడ్లు తినేవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. పూర్తిగా ఉడికించిన ఆహారం తింటే వైరస్ ముప్పు ఉండదని స్పష్టం చేశారు.
ఇతర రాష్ట్రాల్లో...
- మధ్యప్రదేశ్‌లోని 18 జిల్లాలకు ఫ్లూ సోకినట్లు తెలుస్తోంది. కేరళ సహా దక్షిణాది రాష్ట్రాల నుంచి పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణాను నిషేధించింది. ఇందోర్, నీముచ్, అగర్ మాల్వా ప్రాంతాల్లో పౌల్ట్రీ వ్యాపారాలను మూసేశారు. హరియాణాలోనూ బర్డ్ ఫ్లూ సోకిన పక్షులను హతమార్చుతున్నారు.
- గుజరాత్‌లోని సూరత్, వడోదరా జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి. చనిపోయిన కాకుల్లో వైరస్ ఉన్నట్లు తేలింది. ఆదివారం వడోదరాలోని ఓ గ్రామంలో 57 పావురాలు మరణించాయి. దీంతో పది కి.మీ పరిధిలో హైఅలర్ట్ ప్రకటించి అత్యవసర చర్యలు చేపట్టారు.
- రాజస్థాన్‌లోని 13 జిల్లాల్లో ఇప్పటివరకు 2950 పక్షులు మరణించాయని ఆ రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్ బీరేంద్ర సింగ్ తెలిపారు. అందులో 2,200 కాకులే ఉన్నాయని చెప్పారు. కోళ్లలో ఈ వైరస్ నిర్ధరించలేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై పర్యవేక్షణ కోసం ర్యాపిడ్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని టోంక్, కరారులి, భిల్వాడా జిల్లాలో వలస పక్షులు, కాకులు మరణించాయి.
ఆంక్షలు వద్దు: కేంద్రం
బర్డ్ ఫ్లూ కారణంగా పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకాలపై ఆంక్షలు విధించొద్దని రాష్ట్రాలను కేంద్రం కోరింది. మండీలను మూసేయవద్దని సూచించింది. మనుషులకు బర్డ్ ఫ్లూ సోకుతుందనేందుకు ఆధారాలు లేవని, దీని గురించి వదంతులు వ్యాపించకుండా జాగ్రత్తపడటం ముఖ్యమని కేంద్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. గాజీపుర్ మండీని దిల్లీ ప్రభుత్వం మూసేసిన నేపథ్యంలో.. కేజ్రీవాల్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. సరిగ్గా వండిన ఆహారం తింటే బర్డ్ ఫ్లూ ముప్పు ఉండదని స్పష్టం చేశారు.
మరోవైపు, అన్ని రాష్ట్రాలు పీపీఈ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం సూచించింది. పక్షులను వధించేందుకు కావాల్సిన పరికరాలను సిద్ధం చేసుకోవాలని తెలిపింది. వైద్యాధికారులతో సమన్వయంతో పనిచేయాలని పశుసంవర్థక శాఖ అధికారులకు సూచించింది. మనుషులకు వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
ఇదీ చదవండి: కోడి మాంసం, గుడ్లు తినడం ఎంతవరకు సురక్షితం?!