ఎన్నికలకు ముందు రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార జనతా దళ్ యూనైటెడ్(జేడీయూ)లో చేరారు.
ఎంతో కాలంగా ఆర్జేడీలో ఉన్న చంద్రికా రాయ్‌తో పాటు ఫరాజ్ ఫాత్మీ, జైవర్ధన్ యాదవ్ గురువారం జేడీయూ కండువా కప్పుకున్నారు.
వీడిన వియ్యంకుడు
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, చంద్రికా రాయ్ వియ్యంకులు కావడం గమనార్హం. లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు తన కుమార్తె ఐశ్వర్యా రాయ్నిచ్చి వివాహం చేశారు చంద్రిక. అయితే ప్రస్తుతం తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్య విడిగా ఉంటున్నారు.
తండ్రి బాటలో!
కేంద్ర మానవ వనరుల శాఖ మాజీ మంత్రి మహ్మద్ అలీ అష్రఫ్ ఫాత్మీ కుమారుడే ఫరాజ్ ఫాత్మీ. 2004 నుంచి 2009 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు అలీ. గతేడాది జులైలోనే జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం కుమారుడు సైతం తండ్రి బాటలోనే పయనించారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ మార్పులకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో రాష్ట్ర శాసనసభకు ఓటింగ్ జరగాల్సి ఉంది.