బిహార్ రెండో దఫా ఎన్నికల సమరం దేశంలోని రాజకీయవర్గాలను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. రెండో దశలో పోలింగ్ జరిగే 94 స్థానాల్లో కీలకమైన అభ్యర్థులు బరిలో ఉండటం ఆసక్తి రేపుతోంది. బడా రాజకీయ నేతలు, తలపండిన సీనియర్లు, సీఎం అభ్యర్థిగా పరిగణిస్తున్నవారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో రెండో దశలోనే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రెండో దశ ఎన్నికకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.
రెండో దశలో బరిలో నిలిచిన పది మంది ప్రధాన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి..
1. తేజస్వీ యాదవ్, రాఘోపుర్
బిహార్ ఎన్నికల్లో మహాకూటమి తరపున అన్నీ తానై నడిపిస్తున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్. ప్రస్తుతం రాఘోపుర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. 2015 ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి విజయఢంకా మోగించారు. భాజపా నేత సతీష్ కుమార్‌పై గెలుపొందారు. రాఘోపుర్ నియోజకవర్గం రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ)కి కంచుకోట. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవి.. 1995 నుంచి 2010 వరకు ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. 2010లో జేడీయూ సతీష్ కుమార్ చేతిలో రబ్రీ దేవి ఓడిపోయారు. తర్వాతి ఎన్నికల్లో జేడీయూ టికెట్ ఇవ్వకపోవడం వల్ల భాజపాలో చేరిన సతీశ్.. తేజస్వీ చేతిలో ఓటమి చవిచూశారు.
2. తేజ్ ప్రతాప్ యాదవ్, హసన్‌పుర్
గతంలో మహువా నుంచి పోటీ చేసిన లాలూ రెండో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. ప్రస్తుతం హసన్‌పుర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గంలో యాదవులు, ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు. జేడీయూ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ రేతో పోటీ పడనున్నారు తేజ్ ప్రతాప్.
3. పుష్పమ్ ప్రియా చౌధరీ, బంకిపోరె
జేడీయూ నేత వినోద్ చౌధరీ కూతురే ఈ పుష్పమ్ ప్రియా చౌధరీ. పట్న జిల్లాలోని బంకిపోరె స్థానం నుంచి బరిలో ఉన్నారు. ప్లూరల్స్ పార్టీని స్థాపించి బిహార్ రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టిన ఆమె.. గత కొన్ని నెలలుగా సీఎం నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. బిహార్‌లో భారీ మార్పులు రావాలంటూ గళమెత్తుతున్నారు. భాజపా ఎమ్మెల్యే నవీన్, కాంగ్రెస్ నేత లవ్ సిన్హా ఈ స్థానం నుంచి పోటీ పడుతున్నారు.
4. లవ్ సిన్హా, బంకిపోరె
పట్నా జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం అత్యంత కీలకమైన స్థానం. ఇక్కడి నుంచి భాజపా మాజీ నేత శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. 2006 నుంచి ఈ స్థానానికి భాజపా నేత నితిన్ నాబిన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అంతకుముందు నితిన్ తండ్రి నాబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. 2015లో జరిగిన ఎన్నికలో నితిన్ నాబిన్ దాదాపు 40 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు.
లవ్ సిన్హా పలు సినిమాల్లోనూ కనిపించారు. 2010లో వచ్చిన హిందీ చిత్రం సదియా చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆయన.. చివరి సారి పల్టాన్ సినిమాలో కనువిందు చేశారు.
5. పప్పు యాదవ్, మధేపురా
జన్ అధికార్ పార్టీ-లోక్తాంత్రిక్ అధినేత రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్... మధేపుర స్థానం నుంచి బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆర్జేడీ నేత చంద్రశేఖర్, జేడీయూ నేత నిఖిల్ మండల్లతో పోటీ పడనున్నారు.
2015లో ఆర్జేడీ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు పప్పు యాదవ్. సీపీఎం ఎమ్మెల్యే అజిత్ సర్కార్ హత్య కేసులో చాలా కాలం జైలులో ఉన్నారు. అనంతరం సుప్రీంకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.
6. చంద్రికా రాయ్, పర్సా
బిహార్ మాజీ మంత్రి, లాలూ మాజీ వియ్యంకుడు చంద్రికా రాయ్ పర్సా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. జేడీయూ తరపున ఆయన టికెట్ సంపాదించారు. ఆర్జేడీ నేత చోటే లాల్ రాయ్ చంద్రికకు గట్టి పోటీ ఇవ్వనున్నారు. పర్సా నుంచి చంద్రిక ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు తన కూతురినిచ్చి వివాహం జరిపించారు చంద్రిక. కానీ కొన్ని కారణాల వల్ల వీరి మధ్య విభేదాలు తలెత్తతాయి. దీంతో లాలూ కుటుంబంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఆర్జేడీ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
7. శ్రవణ్ కుమార్, నలంద
నితీశ్ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాలు, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న శ్రావణ్ కుమార్ సైతం రెండో దశలో బరిలో ఉన్నారు. మరోసారి నలంద స్థానం నుంచి గెలుపొందాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ నేత గుంజన్ పటేల్ ఆయనకు ప్రధాన పోటీదారుగా ఉన్నారు.
8. నంద కిశోర్ యాదవ్, పట్నా సాహిబ్
మరో మంత్రి నంద కిశోర్ యాదవ్ సైతం ఇదే విడతలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రహదారుల నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఆయన భాజపా తరపున పట్నా సాహిబ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆరెస్సెస్ నుంచి క్రమంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. 1995 నుంచి ఈ స్థానంలోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రవీణ్ కుష్వాహా పోటీ చేస్తున్నారు.
9. రిత్లాల్ యాదవ్, దానాపుర్
ఆర్జేడీ తరపున బరిలో ఉన్న మరో ప్రధాన నేత రిత్లాల్ యాదవ్. 2020 ఆగస్టు వరకు జైలులోనే ఉన్న ఆయన దానాపుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ఆశా సిన్హాతో తలపడుతున్నారు. ఆశా సిన్హా భర్త సత్యనారాణ సిన్హా హత్య కేసులో రిత్లాల్ నిందితుడుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య పోరు అత్యంత ఆసక్తి కలిగిస్తోంది. హత్యారోపణలే కాకుండా రిత్లాల్ యాదవ్‌పై ఉన్న క్రిమినల్ కేసుల జాబితా చాంతాడంత ఉంటుంది. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన పేరు అత్యంత సుపరిచితం.
10. కుమారి మంజు వర్మ, చెరియా బరియార్పుర్
నితీశ్ ప్రభుత్వంలో ఇదివరకు మంత్రిగా పనిచేశారు కుమారి మంజు వర్మ. ముజఫర్‌పుర్ షెల్టర్ హోంలోని 34 మంది బాలికలపై వేధింపులకు పాల్పడ్డ కేసులో తన భర్త పేరు బయటకు రావడం వల్ల మంత్రి పదవికి మంజు వర్మ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇదే కేసులో 2018 నవంబర్‌లో అరెస్టు అయి జైలుకు వెళ్లారు. అనంతరం పట్నా హైకోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసింది. ప్రస్తుతం బెగుసరాయ్ జిల్లాలోని చెరియా బరియార్పుర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇక్కడి నుంచి రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ముచ్చటగా మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఇలా.. ఓవైపు హేమాహేమీలు, మరోవైపు యువనేతలతో రెండో విడత ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరి ఇక్కడి ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.