పోలింగ్ కేంద్రం దగ్గర్లోనే ఉన్నా కొందరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపరు. కానీ బిహార్ నవాదా జిల్లా కవాకోల్ ప్రాంతంలోని ధనియా గోరిహియా గ్రామస్థులు మాత్రం టాక్టర్ కట్టుకొని పోలింగ్ బూత్‌కు వెళ్లారు. సాయంత్రం వరకు లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ట్రాక్టర్ కిరాయికి తమవద్ద డబ్బులు లేకపోతే విరాళాలు సేకరించి.. రవాణా ఏర్పాట్లు చేసుకున్నారు.
ఈసారి ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిచినా తమ గ్రామంలో రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు గ్రామస్థులు. అందుకే అధ్వాన్నంగా ఉన్న రోడ్డు మార్గం ద్వారానే 36 కి.మీ ట్రాక్టర్లో ప్రయాణించి ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. సరైన రోడ్డు సదుపాయం లేని కారణంగా ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఒక్కోసారి అత్యవసర పరిస్థితుల్లో భుజాలపైనే రోగులను ఆస్పత్రికి తరలిస్తామని.. కొంత మంది మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయేవారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
మొదట్లో ధనియాలో పోలింగ్ కేంద్రం ఉండేదని కానీ, ఈ మధ్యే పచాంబకు మార్చారని గ్రామస్థులు తెలిపారు. ఈ గ్రామం బిహార్‌లో నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్న గోవిందాపుర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఓటర్లు మాత్రం ఎలాంటి భయాందోళనలు లేకుండా ఈసారి ఉత్సాహంతో భారీగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇక్కడ పోలింగ్ 72.2 శాతంగా నమోదైంది.
గోవిందాపుర్లో జేడీయూ తరఫున పూర్ణిమా యాదవ్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన ఆర్జేడీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆర్జేడీ తరఫున మహమ్మద్ కమ్రాన్ పోటీ చేస్తున్నారు. ఎల్జేపీ నుంచి రంజిత్ యాదవ్ నిలబడ్డారు.