మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి.. ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వీ యాదవ్ అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేసేందుకు భాజపా ప్రణాళికలు రచిస్తోంది. ఆయన సొంత నియోజకవర్గం, ఆర్జేడీ కంచుకోటగా ఉన్న రఘోపూర్లోనే ఓడించేందుకు భాజపా కంకణం కట్టుకుంది. అందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయి ప్రణాళికతో.. పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నారు కమలనాథులు.
అన్నీ తానై నడిపిస్తున్నారు...
లాలూ ప్రసాద్ యాదవ్ జైలు పాలైన తర్వాత.. ఆర్జేడీని అన్నీ తానై నడిపిస్తున్నారు తేజస్వీ యాదవ్. తాజా ఎన్నికల్లో ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి సీఎం నితీశ్ కుమార్‌కు సవాల్ విసురుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి ఈసారి ఎలాగైనా అధికారం ఒడిసిపట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ఆయన.. లాలూ కుటుంబానికి కీలకంగా ఉన్న రఘోపూర్ నుంచే మరోసారి బరిలోకి దిగుతున్నారు. అయితే ఎన్డీఏ పొత్తులో భాగంగా ఈ స్థానం భాజపాకు దక్కింది.
క్షేత్రస్థాయి అడుగులు
ఇప్పటికీ భాజపా ఈ స్థానంలో అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రత్యేక దృష్టి సారించిన పార్టీ అధిష్ఠానం.. కీలక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేయనుంది. ప్రస్తుతం ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తేజస్వీ యాదవ్‌ను ఓడించటమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది కమలదళం.
ఇప్పటికే.. పార్టీకి నమ్మకంగా పని చేసిన కీలకమైన కార్యకర్తలను రంగంలోకి దించింది. రఘోపూర్‌లో సామాజిక వర్గాల సమీకరణల ఆధారంగా వ్యూహ రచన చేస్తోంది. క్షేత్రస్థాయిలో.. పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను విధేయులకు అప్పగించింది. తేజస్వీ యాదవ్‌ను మట్టికరిపించటమే లక్ష్యంగా పని చేస్తున్నారు భాజపా కార్యకర్తలు, నాయకులు.
పునరావృతం చేయాలనే పట్టుదల..
అయితే, గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. ఈ నియోజకవర్గంలో 242 ఓట్ల స్వల్ప అధిక్యమే సాధించింది ఆర్జేడీ. 2010లో తేజస్వీ యాదవ్ తల్లి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి.. జేడీయూ అభ్యర్థి సతీష్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇదే ఫలితం పునరావృతం చేయాలని భాజపా చూస్తోంది.
మోదీ-పొత్తు
ప్రస్తుతం భాజపా.. ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మాతో బిహార్‌లో ఘనవిజయం సాధించాలని తపిస్తుంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ పనితీరు తమకు కలిసొస్తుందని ఆశాభావంతో ఉంది.
ఎన్డీఏ పొత్తులో భాగంగా.. 121 స్తానాల్లో పోటీ చేస్తన్న భాజపా, 11 స్థానాలు వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీకి కేటాయించింది.
మొత్తం 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి తొలివిడత పోలింగ్.. అక్టోబర్ 28న జరగనుంది. నవంబర్ 3న రెండో విడత, 7న ముడో విడత పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 10న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చూడండి: అభ్యర్థుల ఎంపికలో నితీశ్ 'సోషల్ ఇంజినీరింగ్' మంత్రం
ఇదీ చూడండి: కరోనా కారణంగా బిహార్ ఎన్నికల రూల్స్‌లో మార్పు