జబ్ తక్ రహేగా సమోసే మే ఆలూ... తబ్ తక్ రహేగా బిహార్‌మే లాలూ...! (సమోసాలో ఆలుగడ్డ ఉన్నంత వరకు బిహార్‌లో ఈ లాలూ ఉంటాడు) అంటూ నినదించిన లాలూ ప్రసాద్ యాదవ్ లేకుండానే ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సాగిపోతున్నాయి. 40 ఏళ్లలో తొలిసారి లాలూ ప్రచారం లేకుండా బిహార్ ఈసారి ఎన్నికలకు వెళుతుండటం విశేషం. దాణా కుంభకోణం కేసులో ఝార్ఖండ్‌లో జైలు జీవితం గడుపుతున్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ఎన్నికలకు ఈసారి దూరమయ్యారు. 1977లో తొలిసారి ఎంపీగా ఎంపికైన నాటి నుంచి నేటిదాకా ఎన్నడూ లాలూ ప్రచారం, ఆర్భాటం లేకుండా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు లేవు. లాలూ తనయుడు తేజస్వి యాదవ్ సారథ్యంలోనే పార్టీ ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగింది. విశేషమేమంటే... సొంతపార్టీనే లాలూను పెద్దగా ఈసారి ఎన్నికల్లో గుర్తు చేసుకోకపోవడం! చాలాచోట్ల ఆర్జేడీ ప్రకటనల్లో, పోస్టర్లలో తేజస్వి యాదవ్ ఒక్కడి ఫొటోనే వాడుతున్నారు. లాలూ ఫొటో పెట్టడం లేదు. అంతేగాకుండా... తేజస్వి కూడా పదేపదే 'నయా సోచ్, నయా బిహార్' (కొత్త ఆలోచనలు, కొత్త బిహార్) అంటూ పాతతరాన్ని పక్కనబెడదాం అని ఓటర్లకు పిలుపునిస్తున్నారు. మరి లాలూ ప్రచారం లేకుండా తేజస్వీ సారథ్యంలో పార్టీ ఎంతగా రాణిస్తుందనేది ఆసక్తికరం!
30 మందితో కాంగ్రెస్ ప్రచారం.
కాంగ్రెస్ కూడా ప్రచారంలో దూసుకుపొవాలని భావిస్తోంది. దీని కోసం 30 మంది ప్రచార తారలు (స్టార్ క్యాంపెయినర్లు)ను ఎంపిక చేసింది. జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. ఈ నెల 28న జరిగే తొలి విడత పోలింగ్ కోసం ప్రచారంలో తమ పార్టీ తరఫున 30 మంది పాల్గొంటారని పేర్కొంది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, మీరా కుమార్, గులాం నబీ ఆజాద్, ప్రియాంక గాంధీ, మదన్ మోహన్ ఝా, అశోక్ గహ్లోత్, అమరీందర్‌సింగ్, భూపేష్ బాఘేల్, సచిన్ పైలట్, కీర్తి ఆజాద్, సంజయ్ నిరుపమ్ సహా మొత్తం 30మంది బిహార్ తొలి విడత ఎన్నికలకు ప్రచారం చేయనున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో (అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో) జరగనున్నాయి. నవంబర్ 10న ఓట్లలెక్కింపు జరగనుంది.