బిహార్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాజపా-జేడీయూ మధ్య కలహాలు తీవ్రమయ్యాయా? అన్యోన్యంగా ఉంటున్న రెండు పార్టీల మధ్య కేంద్రమంత్రి పదవులకై చిచ్చు ఏర్పడిందా? తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి జేడీయూ ప్రతినిధులెవరూ హాజరవకపోవడం, తాజాగా బిహార్ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇచ్చినప్పటికీ భాజపా నేతలు చేరకపోవడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది.
మంత్రివర్గ విస్తరణలో చేరని భాజపా
బిహార్‌లో మంత్రివర్గాన్ని విస్తరించారు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. కొత్తగా నేడు 8 మందితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. వీరంతా జేడీయూ నేతలే. మిత్రపక్షమైన భాజపాకు నితీశ్ కుమార్ మంత్రి పదవి ఇచ్చినా... మంత్రివర్గంలో చేరేందుకు వారు ఆసక్తి కనబరచలేదు.
"ఖాళీగా ఉన్న మంత్రి పదవి భాజపాకు ఇస్తామని నితీశ్ కుమార్ చెప్పారు. అయితే భవిష్యత్తులో మంత్రి పదవిని తీసుకోవాలని భాజపా భావించింది."
- సుశీల్ కుమార్ మోదీ, బిహార్ ఉపముఖ్యమంత్రి
నితీశ్ స్పందన
భాజపా-జేడీయూ కూటమిపై వస్తున్న ఊహాగానాలను తోసిపుచ్చారు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. మంత్రివర్గంలో భాజపాకు అవకాశం ఇచ్చినా ఆ పార్టీ నేతలే ముందుకు రాలేదని చెప్పారు. భాజపాతో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు నితీశ్.
అలా మొదలైంది...
ఎన్డీఏలో భాగస్వామి అయిన జేడీయూకు బిహార్‌లో 16 మంది లోక్‌సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయినా... మోదీ మంత్రివర్గంలో ఆ పార్టీ నేతలు ఎవరూ చేరలేదు. పదవుల పంపకంపై భాజపా-జేడీయూ మధ్య చర్చలు విఫలమవడమే ఇందుకు కారణం. రెండు పార్టీల బంధంపై అలా మొదలైన చర్చ... ఇప్పుడు బిహార్ మంత్రివర్గ విస్తరణతో మరింత విస్తృతమైంది.
నితీశ్‌కు భాజపా తప్పనిసరి
243 మంది ఎమ్మెల్యేలున్న బిహార్ అసెంబ్లీలో ప్రస్తుతం జేడీయూ(73), భాజపా(54), ఎల్జేపీ(2), ఐఎన్డీ(4) కూటమిగా ఏర్పడి మొత్తం 133 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీ(79), కాంగ్రెస్(27) కూటమికి మరిన్ని స్థానిక పార్టీలతో కలిపి మొత్తం 110 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒకవేళ భాజపా-జేడీయూ విభేదాలు మరింత ముదిరితే... నితీశ్ కుమార్ పదవికే ఎసరు వచ్చే ప్రమాదముంది.
ఇదీ చూడండి : తుపాకి తిరగేసి వైద్యునిపై దుండగుల దాడి