భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ నుంచి తప్పుకున్నారు జస్టిస్ ఎస్ రవీంద్ర భట్. గతంలో ఇదే కేసులో కేంద్రప్రభుత్వం తరఫున తాను వాదించడమే ఇందుకు కారణమని చెప్పారు. బాధితులకు అదనపు పరిహారంగా అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్(యూసీసీ) నుంచి రూ.7,844 కోట్లు ఇప్పించాలని కోరుతూ ఈ వ్యాజ్యం వేసింది కేంద్రం.
జస్టిస్ రవీంద్ర తప్పుకున్న నేపథ్యంలో పిటిషన్ విచారణను వాయిదా వేసింది జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి బుధవారం నిర్ణయం తీసుకుంటారని స్పష్టంచేసింది.
భోపాల్ దుర్ఘటన...
1984 డిసెంబర్లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసైనేట్ విషవాయువులు విడుదలై సుమారు 3000 మంది మృతి చెందారు. 1.02 లక్షల మందికిపైగా అనారోగ్యం పాలయ్యారు. బాధితులకు రూ.715 కోట్లు పరిహారంగా చెల్లించింది యూసీసీ.