కరోనా సోకితే సొంత వారే దూరంగా ఉండిపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. కట్టుకున్న భార్యకు కొవిడ్ పాజిటివ్‌గా తేలగా.. భర్తే వదిలేసి వెళ్లిపోయాడు. మహమ్మారితో పోరాడి చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయినా.. ఆఖరి చూపు చూసేందుకైనా రాలేదా వ్యక్తి. వైద్యులే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.
అసలేం జరిగిందంటే.?
రెండేళ్ల క్రితం పెళ్లైన ఓ జంట.. జేసీ నగర్‌లోని మహాలక్ష్మీ ఏరియాలో నివాసముంటున్నారు. భర్త కారు డ్రైవరుగా, భార్య ఓ షాపింగ్‌మాల్‌లో సేల్స్ ఉమన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల అనారోగ్యం బారినపడ్డ ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడా భర్త. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ వార్త తెలిసిన వెంటనే ఆమెను వదిలి పారిపోయాడు అతడు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.
వైరస్‌తో పోరాడిన ఆ మహిళ ఆదివారం ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయమై ఆ ఇంటి యజమాని బెంగళూరు నగర పాలకసంస్థ అధికారులకు సమాచారమిచ్చారు. ఆ తర్వాత వైద్యులే తీసుకెళ్లి కరోనా మార్గదర్శకాలను అనుసరించి అంత్యక్రియలు చేశారు.
బాధితురాలి తొలి కాంటాక్ట్ పర్సన్ భర్తే కావడం వల్ల అతడికీ వైరస్ సోకి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి: చీరలతో ఇద్దరు యువకుల్ని కాపాడిన మహిళలు