15 మంది సభ్యులతో కూడిన స్వతంత్ర ధర్మనిధి 'శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్'ను ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక్క రోజు కూడా గడవకముందే.. అయోధ్యలో రామమందిర నిర్మాణంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ ఏప్రిల్లో మందిర నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. రామనవమి పర్వదినం(ఏప్రిల్ 2) లేదా అక్షయ తృతీయ(ఏప్రిల్ 26) రోజున ఆలయ పనులకు శంకుస్థాపన జరుగుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.
అయితే ట్రస్టు తొలి సమావేశంలో కచ్చితమైన తేదీని ప్రకటిస్తామని తెలిపారు ట్రస్ట్ సభ్యులు స్వామి దేవగిరి మహారాజ్. మరో రెండేళ్లల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ముస్లిం కక్షిదారుల అసంతృప్తి
మరోవైపు మసీదు నిర్మాణానికి కేటాయించిన ఐదెకరాల స్థలంపై ముస్లిం కక్షిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ధన్నీపుర్ గ్రామం నగర కేంద్రానికి చాలా దూరంలో ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండి:అయోధ్య రామమందిరానికి 'శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర' ట్రస్ట్
బుధవారమే కేటాయింపు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సున్నీఫక్ఫ్ బోర్టుకు అందించే 5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమికి ఉత్తరప్రదేశ్ కేబినెట్ బుధవారమే ఆమోద ముద్రవేసింది. అయోధ్యకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపుర్ అనే గ్రామంలో.. మసీదు నిర్మించుకునేందుకు ఐదెకరాల భూమిని కేటాయించింది.