కరోనా తదనంతర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే విషయంలో బ్యాంకింగ్ రంగానిది కీలక పాత్ర అని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అమలు చేయడంలోనూ ఈ రంగం ప్రధానంగా వ్యవహరిస్తుందని తెలిపారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రజలకు మాస్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సమష్టి కృషితో కరోనా సంక్షోభం నుంచి దేశం గట్టెక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచదేశాల్లో భారత్లోనే అతి తక్కువ కరోనా మరణాల రేటు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
"ప్రభుత్వ సమర్థవంతమైన క్లినికల్ మేనేజ్మెంట్ వల్ల దేశంలో కరోనా మరణాల రేటు 2.46 శాతంగా ఉంది. మనం చాలా వ్యాధులతో పోరాడాం. పోలియో, మశూచి వంటి వ్యాధులను నిర్మూలించాం. ఎయిడ్స్, నిఫా, స్వైన్ ఫ్లూ, జికా వైరస్లను దీటుగా ఎదుర్కొన్నాం. ఎబోలాను దేశంలోకి రానీయకుండా అడ్డుకున్నాం. మన సమష్టి కృషితో ఈ విపత్తును కూడా ఎదుర్కోగలుగుతాం."
-హర్షవర్ధన్, కేంద్ర వైద్య శాఖ మంత్రి
వైరస్ గురించి ప్రపంచానికి చైనా సమాచారం అందించిన 24 గంటల్లోపే ప్రధాని మోదీ నిపుణుల కమిటీతో సమావేశం నిర్వహించారని హర్షవర్ధన్ గుర్తు చేశారు. వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు దేశంలో జనవరిలో ఒకే ల్యాబ్ ఉండేదని.. ప్రస్తుతం ఈ సంఖ్య 1268కి చేరిందని తెలిపారు. వచ్చే 10-12 వారాల్లో పది లక్షల మందికి పరీక్షలు నిర్వహించే సామర్థ్యం దేశం సొంతం చేసుకుంటుందని చెప్పారు.
కరోనా వంటి విపత్కరమైన పరిస్థితుల్లో దేశ హితం కోసం పీఎన్బీ బ్యాంకు ముందుకు రావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. లాలా లజపత్రాయ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో బ్యాంకును నెలకొల్పారని చెప్పారు. భారతీయుల పెట్టుబడితో, భారతీయుల నిర్వహణలో ప్రారంభమైన తొలి స్వదేశీ బ్యాంక్ ఇదేనని కితాబిచ్చారు.