కర్ణాటక బెంగళూరులో సినీఫక్కీలో చోరికి పాల్పడి 77 కేజీల బంగారాన్ని దోచుకున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. నేపాల్‌లో తలదాచుకున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 8.6కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
సినీఫక్కీలో..
గతేడాది డిసెంబర్ 22న బెంగళూరు పులకేశినగర్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ గోడకు కన్నం వేసి 77కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు దుండగులు. వీరికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు కర్ణాటక పోలీసులు. దుండగులు నేపాల్‌లో తలదాచుకున్నారనే పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లారు. ముఠాలోని నలుగురికి అదుపులోకి తీసుకున్నారు.
బిహార్ గ్యాంగ్‌లీడర్...
బిహార్‌కు చెందిన ఓ గ్యాంగ్ లీడర్ ఈ చోరీకి ప్రధాన సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. నేపాల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డుల సాయంతో 12 మంది దుండగులతో కలిసి ఈ చోరీకి పాల్పడ్డట్టు పేర్కొన్నారు. చోరీ అనంతరం దుండగులు రెండు బృందాలుగా విడిపోయి బంగారాన్ని సమంగా పంచుకున్నారని తెలిపారు. ఓ బృందం దిల్లీ పరారవ్వగా.. మరో బృందం నేపాల్ వెళ్లినట్లు వివరించారు.
ప్రధాన సూత్రధారి సహా మిగతా నిందితుల కోసం ముమ్మర గాలింపు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి : 'న్యూఇయర్ కానుకగా రైల్ ఛార్జీలు, గ్యాస్ ధరల పెంపు'