కర్ణాటక మంగళూరులో ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖకు చెందిన ఓ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. తిరుపతి నుంచి మంగళూరు వెళుతుండగా బస్సుపై దాడికి పాల్పడ్డారు నిరసనకారులు.
బంద్కు పిలుపు..
ప్రభుత్వం, ప్రైవేటు రంగాల్లో కన్నడీగులకు ఎక్కువ శాతం ఉద్యోగాలు కల్పించాలంటూ కర్ణాటకలో పలు సంఘాలు బంద్ చేపట్టాయి. ఉద్యోగ నియామకాలకు సంబంధించి 1986లో.. కేంద్ర మాజీ మంత్రి సరోజినీ మహిషి కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయాలంటూ.. 'కర్ణాటక సంగతనేగల ఒక్కూట' అనే సంస్థ ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు.
బెంగళూరులో సిటీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నప్పటికీ.. ప్రయాణికులు కనిపించటం లేదు. కొన్ని ఆటో సంఘాలు బంద్కు మద్దతు ఇస్తుండగా మరికొన్ని చోట్ల వాహనాలు నడుస్తున్నాయి. ప్రధాన మార్కెట్ కూడలి కేఆర్ మార్కెట్, పరిసర ప్రాంతాల్లో బంద్ ప్రభావం కనిపించటం లేదు. ఆందోళనకారులు నగరంలో తిరుగుతూ.. దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
భారీ భద్రత..
ముఖ్యమైన ప్రదేశాలు, వ్యాపార కూడళ్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. శాంతియుతంగా నిరసనలు తెలపాలని సూచించారు ముఖ్యమంత్రి యడియూరప్ప.
ఇదీ చూడండి: నడిరోడ్డుపై భార్యను ఈడ్చుకెళ్లిన 'పోలీస్' భర్త!