ఫేస్‌బుక్ పోస్ట్ కారణంగా బెంగళూరులో మంగళవారం చెలరేగిన అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారాయి. పులకేసినగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతం ఏకంగా యుద్ధభూమిని తలిపిస్తోంది. వీధి దీపాలతో పాటు రహదారిపై ఉన్న దుకాణాల సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. డీసీపీ వ్యాన్, పోలీసుల వాహనం సహా మొత్తం 8 వాహనాలకు నిప్పంటించారు. మరికొన్ని వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ హింసాత్మక దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం కాగా.. ఇప్పుడివి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి బంధువు ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం బెంగళూరులో అల్లర్లకు దారితీసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన అల్లర్లు.. బుధవారం ఉదయం వరకు కొనసాగాయి.
145 మంది అరెస్ట్..
ఈ ఘటనలో సుమారు 3వేల మందికిపైగా నిరసనకారులు రెచ్చిపోయి దాడులకు పాల్పడ్డారని తెలిపారు పోలీసులు. అల్లర్లను అదుపుచేసే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఆందోళనకారులు మరణించగా.. 50మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 145 మందిని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: బెంగళూరుకు ఏమైంది? ఎందుకింత హింస?